ఆందోళన చేస్తున్న ఆశ కార్యకర్తల
కేశంపేట: ప్రజల సంపూర్ణ ఆరోగ్యం కోసం కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పలు పథకాలు క్షేత్రస్థాయిలో సక్రమంగా అందేందుకు కృషి చేస్తున్న ఆశ కార్యకర్తల జీవితాలు సంతోషంగా లేవు. ఆరు నెలలుగా వారికి వేతనాలు అందకపోవడంతో కుటుంబాలు గడవడం కష్టంగా మారింది. గ్రామాల్లో పని చేస్తున్న ఆశ కార్యకర్తలు ప్రతి కుటుంబం పైన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు టీకాలను సకాలంలో అందజేస్తున్నారు.
అదేవిధంగా కుష్టు, క్షయతో పాటు ఇతర అంటువ్యాధుల నివారణకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. గ్రామాల పైన పూర్తి అవగాహన ఉండడంతో వీరి సాయంతో సర్కారు పోలియో, కంటివెలుగు తదితర కార్యక్రమాలను విజయవంతం చేస్తోందని చెప్పవచ్చు. ఇంతటి క్రియాశీలక పాత్ర పోషిస్తున్న ఆశ కార్యకర్తలను సర్కారు నిర్లక్ష్యం చేస్తోంది. వారికి నెలకు రూ. 7,500 చొప్పున అందిస్తున్న వేతనాలను 6 నెలలుగా చెల్లించడం లేదు. దీంతో వారికి పూటగడవడం కష్టంగా మారడంతో పస్తులు ఉండాల్సిన దుస్థితి దాపురించింది. పలుమార్లు తమ వేతనాలు ఇవ్వాలని ఉన్నతాధికారులు, ప్రభుత్వానికి విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని, పట్టించుకున్న పాపాన పోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామాల్లో ‘ఆశ’ల బాధ్యతలు
మాతా శిశుసంరక్షణ, ఆసుపత్రిలో ప్రసవాలు చేయించడం, గర్భిణులు, చిన్నారులకు సకాలంలో టీకాలు ఇప్పించడం ఆశ కార్యకర్తల ముఖ్య విధి. గ్రామాల్లో అంటువ్యాధులు సోకిన వారికి ప్రాథమిక చికిత్స అందించడం, ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడం తదితర విధులను నిర్వహిస్తారు. క్షయ, కుష్టు బాధితులకు ఎప్పటికప్పుడు మాత్రలు, మందులు అందజేయడం వీరి విధి. దీంతోపాటు ఇంటింటి సర్వేలు నిర్వహిస్తుంటారు. గర్భిణుల ప్రసవం కోసం వారిని పీహెచ్‌సీలకు తరలిస్తుంటారు. జిల్లాలో 1,123 మంది ఆశ కార్యకర్తలు పని చేస్తున్నట్టు జిల్లా వైధ్యాధికారులు తెలిపారు. ఆశ కార్యకర్తల కోసం నిధులు మంజూరు కాకపోవడంతో పారితోషికం అందించడంలో జాప్యం జరుగుతోందని చెప్పారు.
వెంటనే చెల్లించాలి
ప్రభుత్వం మా సేవలను గుర్తించి రూ. 6 వేలుగా ఉన్న పారితోషికాన్ని 7,500లకు పెంచింది. కానీ, ఎప్పడూ సరిగా అందడం లేదు. సక్రమంగా పారితోషికం ఇవ్వాలి. ఆశ కార్యకర్తలు గ్రామాల్లో అందుబాటులో ఉంటూ ప్రజల ఆరోగ్యం కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. పెంచిన పారితోషికాన్ని వెంటనే చెల్లించాలి. – లలిత, ఆశ కార్యకర్తల సంఘం జిల్లా అధ్యక్షురాలు
పోషణ భారంగా మారింది.
ఆరు నెలలుగా పారితోషికం లేకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. మాకు చెల్లించాల్సిన పారితోషికాన్ని వెంటనే విడుదల చేయాలి. కుటుంబ పోషణ కోసం అప్పులు చేస్తున్నాం. మా పారితోషికం విషయంలో సర్కారు వెంటనే చర్యలు తీసుకోవాలి. – వసంత, ఆశకార్యకర్త కేశంపేట
Comments
Please login to add a commentAdd a comment