11,705... గత 2009 అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లా ఎమ్మెల్యేలు గెలుపొందిన సగటు మెజార్టీ ఇది. సాధారణంగా ఎమ్మెల్యే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపోటములు కనిపిస్తాయి. కానీ కిందటిసారి జిల్లాలో నియోజకవర్గాల వారీగా మెజార్టీ పరిశీలిస్తే ఈ పరిస్థితి తలకిందులుగా కనిపిస్తోంది. అత్తెసరు ఓట్లతో బయటపడ్డవారే ఎక్కువగా ఉన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ, టీఆర్‌ఎస్, వామపక్షాలు కలిసి పోటీ చేయగా.. కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగింది. అయినప్పటికీ ఇరు పార్టీల అభ్యర్థులు అరకొర ఓట్ల తేడాతో గెలుపొందారు.
తక్కువగా.. ఎక్కువగా..
గత శాసనసభ ఎన్నికల్లో జిల్లాలో శేరిలింగంపల్లి నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన ఎం.భిక్షపతి యాదవ్ టీడీపీ అభ్యర్థిపై కేవలం 1,327 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత చేవెళ్ల నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన రత్నం 2,249 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు. ఉప్పల్‌లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన బండారు రాజిరెడ్డి జిల్లాలోనే అత్యధిక మెజార్టీ (28,183 ఓట్లు) సొంతం చేసుకోగా.. ఆ తర్వాతి స్థానంలో కుత్బుల్లాపూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన కూన శ్రీశైలంగౌడ్ 25,862ఓట్ల మెజార్టీతో విజయం సాధించి రెండోస్థానంలో నిలిచారు.
హరీశ్వర్‌రెడ్డి (పరిగి) 19,982 ఓట్ల మెజార్టీ, జయప్రకాష్‌నారాయణ (కూకట్‌పల్లి) 15,643 ఓట్ల మెజార్టీ, మహేందర్‌రెడ్డి (తాండూరు) 13,203 మెజార్టీ ఓట్లు సాధించారు. అదేవిధంగా సుధీర్‌రెడ్డి (ఎల్‌బీనగర్) 13,164, ఆకుల రాజేందర్ (మల్కాజ్‌గిరి) 9,303, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి (ఇబ్రహీంపట్నం) 9,216, సబితారెడ్డి (మహేశ్వరం)7,833, ప్రకాష్‌గౌడ్ (రాజేంద్రనగర్) 7,485, కిచ్చనగారి లక్ష్మారెడ్డి (మేడ్చల్) 5,570, జి.ప్రసాద్‌కుమార్ (వికారాబాద్) 4,859 ఓట్ల మెజార్టీతో గెలుపొంది ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు.
2009 అసెంబ్లీ ఎన్నికలకు ముందు జిల్లాలో ఆరు శాసనసభ నియోజకవర్గాలున్నాయి. అయితే నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా జిల్లాలో 14 శాసనసభ స్థానాలు ఏర్పాటయ్యాయి. 2009 సాధారణ ఎన్నికల పోలింగ్ నాటికి జిల్లాలో 40,18,664 మంది ఓటర్లున్నారు. వీరిలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో 23,37,163 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 58.16 శాతం పోలింగ్ నమోదైంది. గరిష్టంగా ఇబ్రహీం పట్నం నియోజకవర్గంలో 78.54శాతం మంది ఓట్లు వేయగా, తక్కువగా ఉప్పల్ నియోజకవర్గంలో 42.38శాతం ఓటింగ్ నమోదైంది.
గ్రామీణ నియోజకవర్గాల్లో ఎక్కువ మంది ఓటు హక్కును వినియోగించుకోగా, పట్టణ ప్రాంతంలో తక్కువగా పోలింగ్ నమోదైంది. తాజాగా ఓటర్ల సంఖ్య 50 లక్షలకు చేరింది. ఈ సారి ఎన్నికల్లో యువత కీలక పాత్ర పోషించనున్న నేపథ్యంలో ఓటింగ్ ప్రక్రియ ఆసక్తికరంగా మారింది.
- సాక్షి, రంగారెడ్డి జిల్లా
2009 అసెంబ్లీ ఎలక్షన్ రిపోర్ట్
Published Sun, Apr 6 2014 12:48 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement