సీటు కోటిపైనే..! | by conducting special medical exame for management quota government trying to devastation | Sakshi
Sakshi News home page

సీటు కోటిపైనే..!

Published Sun, May 24 2015 2:24 AM | Last Updated on Sat, Sep 15 2018 8:28 PM

సీటు కోటిపైనే..! - Sakshi

సీటు కోటిపైనే..!

- ప్రత్యేక ఎంసెట్‌కు ముందే యాజమాన్య కోటా సీట్ల అమ్మకం
- 500 ఎంబీబీఎస్ సీట్లు హాంఫట్!
- ప్రైవేటు మెడికల్ కాలేజీల బరితెగింపు
- సీట్లు కొన్నవారికి పేపర్ లీక్!
- ‘దోపిడీ’కి సర్కారు వెసులుబాటు...

 
ఇంకా ఎంసెట్ ఫలితాలు రాలేదు... ‘బి’ కేటగిరీ వైద్య సీట్లకు ప్రత్యేక ప్రవేశ పరీక్ష జరగనే లేదు... కానీ ఈలోపే రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు వైద్య కళాశాలలు బరితెగించాయి. యథేచ్ఛగా సీట్ల దందా సాగించాయి. ఎంబీబీఎస్‌కు ఉన్న డిమాండ్‌ను సొమ్ము చేసుకుంటూ యాజమాన్య కోటాలోని సీట్లను ఫిబ్రవరి నుంచే భర్తీ చేసేసుకున్నాయి! కాలేజీని, ప్రాంతాన్నిబట్టి ఒక్కో సీటుకు రూ. 1.10 కోట్ల నుంచి 1.25 కోట్లు దండుకున్నాయి!
 
హైదరాబాద్: రాష్ట్రంలో మొత్తం 2,950 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా వాటిలో 850 సీట్లు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో, 2,100 సీట్లు ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఉన్నాయి. 15 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ‘ఎ’ కేటగిరీలోని 50 శాతం (1,050) సీట్లు, ‘బి’ కేటగిరీలోని 10 శాతం (210) సీట్లను ఎంసెట్ మెరిట్ ద్వారానే ప్రభుత్వం భర్తీ చేసేది. మిగిలిన 40 శాతంలో (25 శాతం యాజమాన్య, 15 శాతం ప్రవాస భారతీయ) సీట్లను ప్రైవేటు కళాశాలలే తమకు నచ్చినట్లు సీట్లు భర్తీ చేసుకునేవి.

అయితే ఈ ఏడాది ప్రభుత్వం ఆ విధానాన్ని మార్చింది. బీ కేటగిరీలోని 35 శాతం సీట్లను యాజమాన్య కోటాలో కలిపేస్తూ రెండ్రోజుల క్రితం ఉత్తర్వులు జారీచేసింది. ఆ ఉత్తర్వుల ప్రకారం ‘ఎ’ కేటగిరీలో 50 శాతం సీట్లు 1,050 ఉంటాయి. అవన్నీ ఎంసెట్ కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తారు. బీ కేటగిరీలో 35 శాతం సీట్లు (735) ఉన్నాయి. వీటికి ప్రస్తుత ఎంసెట్ ర్యాంకుతో సంబంధం లేకుండా ప్రైవేటు వైద్య కళాశాలల ఆధ్వర్యంలోనే ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహించుకొని వారే భర్తీ చేసుకునేలా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

వచ్చే నెల మొదటి వారంలో ప్రత్యేక ప్రవేశ పరీక్షకు ప్రైవేటు కళాశాలలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. వారే కన్వీనర్‌ను నియమించుకొని త్వరలో ప్రత్యేక పరీక్షకు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. మిగిలిన 15 శాతం కోటాలో 315 సీట్లున్నాయి. ఇప్పుడు ఈ మొత్తం సీట్లతోపాటు బి కేటగిరిలో 200 దాకా సీట్లను కూడా యాజమాన్యాలు అమ్మేసుకున్నాయి.
 
‘దోపిడీ’కి సర్కారు వెసులుబాటు...
యాజమాన్య కోటా సీట్లలో ప్రైవేట్ వారి దోపిడీ చాలదన్నట్లు సర్కారు మరో మార్గం కూడా చూపింది. కాలేజీలకు అనుకూలంగా రెండ్రోజుల కిందట మార్గదర్శకాలు జారీ చేసింది. బి కేటగిరిలో 35 శాతం సీట్లకు రూ. 9 లక్షలుగా ఫీజును నిర్ధారించింది. ప్రైవేటు వారు నిర్వహించే ప్రవేశ పరీక్ష రాసి ర్యాంక్ సాధించినా ఏటా రూ. 9 లక్షలు చెల్లించడానికి స్థోమత లేక ఆ సీటు భర్తీ కాకపోతే యాజమాన్యాలు ఆ సీటును భర్తీ చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఈ వెసులుబాటును అడ్డంపెట్టుకునే కాలేజీలు ప్రవేశ పరీక్ష కూడా పెట్టకుండానే బి కేటగిరిలో దాదాపు 200 సీట్లను అమ్ముకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
 
సీట్లు కొన్నవారికి పేపర్ లీక్!
యాజమాన్య కోటా 15 శాతం కంటే అధికంగా సీట్లు తెగనమ్ముకున్న కాలేజీలు బి కేటగిరిలో 35 శాతం సీట్లకు నిర్వహించే ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రాన్ని సీట్లు కొన్నవారికి ముందే లీక్ చేసే ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎంబీబీఎస్ సీటు కావాలంటూ దక్షిణ తెలంగాణలోని ఓ వైద్య కళాశాలను సంప్రదించిన ఓ తండ్రికి ఆ కాలేజీ యాజమాన్యం ఇదే మాట చెప్పింది. ‘మీరు ముందే రూ.1.25 కోట్లు చెల్లించండి. మీ అమ్మాయికి ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం ముందే లీక్ అయ్యేట్టు చూస్తాం’ అని హామీ ఇచ్చింది. దీనిపై ఆయన సాక్షి కార్యాలయానికి ఫోన్ చేయడంతో ఈ విషయం బయటపడింది.
 
ర్యాంకు రాకుంటే డబ్బు వాపస్
కాలేజీలు ఒకవేళ సీట్లన్నీ ముందే భర్తీ చేసుకున్నా ప్రత్యేక ప్రవేశ పరీక్ష ద్వారా వచ్చే ర్యాంకుల బట్టే ప్రైవేటు వైద్య కళాశాలలు యాజమాన్య సీట్లను భర్తీ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ర్యాంకు రాని వారుంటే విద్యార్థుల నుంచి ముందే తీసుకున్న సొమ్మును వెనక్కు ఇవ్వాల్సి ఉంటుంది. మొదటిసారి కాబట్టి కొంత గందరగోళం సాధారణం. మున్ముందు ఈ పరిస్థితి మారనుంది.
- లక్ష్మారెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement