సీఎంవి అనుచిత వ్యాఖ్యలు: చాడ
హైదరాబాద్: సీపీఎం నిర్వహించనున్న పాదయాత్రపై సీఎం కేసీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై సీపీఐ అభ్యంతరం వ్యక్తంచేసింది. ప్రతిపక్షాలకు విమర్శలు చేసే హక్కు లేదనే సీఎం నియంతృత్వ వైఖరిని సీపీఐ నేతలు ఖండించారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన హక్కులు, బాధ్యతలను ఎంతటివారైనా విస్మరించకూడదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి హితవు పలికారు. తెలంగాణ అనుకూల వైఖరి తీసుకోనందుకు సీపీఎంకు తెలంగాణలో ఎలాంటి హక్కులు లేవని సీఎం వ్యాఖ్యానించడం సముచితం కాదన్నారు.
తెలంగాణలో ఎక్కడికక్కడ సీపీఎం నేతలను నిలదీయాలని ప్రజలకు పిలుపునివ్వడం అప్రజాస్వామికమన్నారు. సీఎం స్థాయి వ్యక్తికి ఇది తగదని చెప్పారు. ఎన్నికల వాగ్దానాల అమలు, ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యల పట్ల ప్రజలను చైతన్యపరిచే హక్కు ప్రతి రాజకీయపార్టీకి ఉందన్నారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే సహించమనే భావన కరెక్ట్ కాదని, విపక్షాలు చేసే సహేతుకమైన విమర్శలను సీఎం కేసీఆర్ స్వీకరించాలని సీపీఐ నేత చాడ సూచించారు.