బ్యాక్టీరియాతో మురుగుకు చెక్!
- మూసీ ప్రక్షాళనకు సరికొత్త ప్రయోగం
- సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్న జలమండలి
- ముందుకొచ్చిన మహారాష్ట్ర కంపెనీ
సాక్షి, సిటీబ్యూరో: మురుగుతో కాలుష్యమవుతున్న మూసీ జలాలను ప్రక్షాళన చేసేందుకు జలమండలి వినూత్న ప్రయోగంపై దృష్టిపెట్టింది. జీవ,రసాయన వ్యర్థాలను హరించే ‘మైక్రో ఆర్గానిజం కల్చర్ బ్యాక్టీరియా’తో మురుగు నీటిని శుద్ధిచేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం అమెరికా, జపాన్ తదితర దేశాల్లోనే అమల్లో ఉన్న ఈ విధానాన్ని త్వరలో నగరంలోని నల్లచెరువు సీవరేజి ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లోనూ పైలట్ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టనున్నారు. నీటిలో ఉన్న ఆర్గానిక్ వ్యర్థాలను ఈ బ్యాక్టీరియా ఆహారంగా స్వీకరించి క్రియారహితంగా మారుతుంది.
సూపర్‌బగ్ తరహాలో పనిచేస్తుంది. ఈ విధానం పర్యావరణానికి కూడా హానికలిగించదని జలమండలి వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. ఈ బ్యాక్టీరియాను పౌడర్ రూపంలో అందజేసేందుకు మహారాష్ట్ర కేంద్రంగా పనిచేస్తున్న ‘ఫెర్మెంటా బయోటెక్ లిమిటెడ్’ (ఎఫ్‌బీఎల్) ముందుకొచ్చింది. ఈ బ్యాక్టీరియా పనితీరుపై సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు, జలమండలి అధికారులకు ఇటీవల పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ విధానం అమలు విషయంలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నిపుణుల సలహాలను కూడా స్వీకరించనున్నారు.
పౌడర్ బ్యాక్టీరియా...
తెల్లటి పౌడర్ రూపంలో ఉన్న మిశ్రమంలో ఈ బ్యాక్టీరియా దాగి ఉంటుంది. దీనిని సీవరేజి ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లో ప్రవేశిస్తున్న వ్యర్థ జలాలపై పెద్ద మొత్తంలో చల్లుతారు. దీంతో బ్యాక్టీరియా క్రియాశీలమవుతుంది. మురుగులోని వ్యర్థాలను తిని సరళ పదార్థాలుగా విడగొడుతుంది. అనంతరం ఇది క్రియారహితంగా మారుతుంది. మురుగు ప్రవాహంలో కొట్టుకుపోతుంది. దీని జీవితకాలం తక్కువగానే ఉంటుంది. ఈ బ్యాక్టీరియా పర్యావరణానికి మేలు చేస్తుందే తప్ప కీడు చేయదని నిపుణులు చెబుతున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఇది తిరిగి చైతన్యం అయ్యే వీలులేదని తెలిపారు.
ప్రస్తుతానికి నో ఛార్జ్....
నల్లచెరువు ఎస్టీపీలో ఈ బ్యాక్టీరియాను ప్రవేశపెట్టినందుకు సదరు సంస్థకు ప్రస్తుతం నిధులు కేటాయించబోమని జలమండలి స్పష్టంచేసింది. ఈ బ్యాక్టీరియా పనితీరు సంతృప్తికరంగా ఉంటేనే అంబర్‌పేట్, అత్తాపూర్ ఎస్టీపీల్లో ప్రయోగించే అంశాన్ని పరిశీలిస్తామని జలమండలి ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఈవిషయంలో పర్యావరణ వేత్తల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామన్నారు.
ఉపయోగాలివీ..
- మురుగునీటిలో వ్యర్థాల నుంచి మీథేన్ గ్యాస్‌ను రిలీజ్ చేస్తాయి.
- ఈ గ్యాస్‌తో విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు.
- మురుగు శుద్ధి కేంద్రంలో ఉన్న ఏరేటర్స్, టర్భైన్స్‌పై వత్తిడి బాగా తగ్గుతుంది.
- మురుగు ప్రవాహానికి ఆటంకాలు తొలగుతాయి.
- ఎస్టీపీలో విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గించవచ్చు.
- శుద్ధిచేసిన వ్యర్థజలాల్లో బీఓడీ, సీఓడీ స్థాయిలను ప్రమాణాల ప్రకారం ఉండేలా చూడవచ్చు.
అనర్థాలూ ఉంటాయి..
మైక్రో ఆర్గానిజం బ్యాక్టీరియాతో భవిష్యత్‌లో మనుషులు, జంతువులు, భూగర్భ జలాలపై దుష్ర్పభావం చూపే అవకాశాలుంటాయి. ఈ బ్యాక్టీరియా కేవలం ఆర్గానిక్ కాలుష్యాలను మాత్రమే తొలగిస్తుంది. మురుగు నీటిలోని నైట్రోజన్, పాస్ఫరస్, అమ్మోనియా వంటి మూలకాలు, భారలోహాలు, రసాయనాలను తొలగించే అవకాశం ఉండదు. పర్యావరణ వేత్తల పర్యవేక్షణలోనే ఇలాంటి బ్యాక్టీరియాను వినియోగించాల్సి ఉంటుంది. -డాక్టర్ వెంకటేశ్వర్, ఓయూ జంతుశాస్త్ర విభాగాధిపతి