మెదక్‌రూరల్: దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఉండాల్సిన చిరుత పులులు వ్యవసాయ పొలాల్లో సంచరిస్తున్నాయి. కంటికి కనిపించిన మూగజీవాలపై పంజా విసురుతున్నాయి. మొన్న రామాయంపేట మండలంలోని లక్ష్మాపూర్, నిన్న అదే మండల పరిధిలోని దండేపల్లిలో, నేడు మెదక్ మండల పరిధిలోని ఖాజీపల్లిలో చిరుత పులులు సంచరిస్తున్నాయి. అటవీ అధికారులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాకు చిరుత చిక్కిన సంఘటన మెదక్ మండలం ఖాజీపల్లి శివారులో ఆదివారం చోటుచేసుకుంది. మెదక్ మండలం ఖాజీపల్లి అటవీ ప్రాంతం శివారులో అదే గ్రామానికి చెందిన కాసుల లక్ష్మినారాయణకు వ్యవసాయ భూమి ఉంది.
అక్కడే పశువులను పెంచుతున్నాడు. శుక్రవారం రాత్రి ఓ లేగదూడను ఏదో జంతువు హతమార్చింది. చిరుత అయి ఉండవచ్చని అనుమానించిన రైతు అటవీ అధికారులకు సమాచామిచ్చాడు. దీంతో అక్కడికి చేరుకున్న అధికారులు ఆ లేగ చనిపోయిన చోటుకు చిరుత తిరిగి రావచ్చనే కోనంలో సీసీ కెమెరాను ఏర్పాటు చేశారు. ఊహించిన విధంగానే సీసీ కెమెరాకు ఓ భారీ చిరుత చిక్కింది. దీంతో చిరుత సంచరిస్తున్నట్లు అధికారులకు స్పష్టమైంది.
దీంతో శివారులో ప్రాంతాల్లో గల వ్యవసాయ పొలాలకు వెళ్లాలంటేనే చుట్టుపక్కల గ్రామాలవారు జంకుతున్నారు. ఇటీవల రామాయంపేట మండలంలో బీభత్సవం సృష్టిస్తున్న చిరుతను పట్టుకోకముందే మెదక్ మండలంలో చిరుత సంచారం అటవిశాఖ అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. అడవుల్లో ఆహారం, నీరు లేకపోవడం వల్లే గ్రామ శివారుల్లోకి చిరుత ప్రవేశిస్తుందా అనే కోణంలో అధికారులు ఆలోచిస్తున్నారు. అధికారులు అప్రమత్తమై చిరుతను బందించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment