నేరెళ్లలో అసలేం జరిగింది..?!
ఐదు రోజులపాటు దళిత కుటుంబాలకు చెందిన పెంట బానయ్య, కోల హరీశ్, చెప్యాల బాలరాజు, పసుల ఈశ్వర్‌కుమార్, గంధం గోపాల్, బత్తుల మహేశ్‌పై థర్డ్ డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలకు గురిచేశారంటూ బాధిత కుటుంబసభ్యుల కథనాలు ఇటు ప్రింట్, అటు ఎలక్ట్రానిక్ మీడియాల్లో ప్రచారం కావడంతో ఈ సంఘటన దుమారం రేపుతోంది. బీజేపీ, కాంగ్రెస్ తదితర పార్టీల రాష్ట్ర, జాతీయ నాయకులు, దళిత, ప్రజాసంఘాలు, జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుల ఆస్పత్రి, జైలు సందర్శన, బాధితులకు పరామర్శ.. సిరిసిల్ల పోలీసులకు మద్దతుగా పోలీసు అధికారుల సంఘం చేసిన ప్రకటన తదితర అంశాలపై ఇంటెలిజెన్స్ అధికారులు పంపించిన నివేదికలు చర్చనీయాంశంగా మారాయి.
ఈ నేపథ్యంలో సీఎం పూర్వ కరీంనగర్ జిల్లా పరిధిలోని నలుగురు కీలక ప్రజాప్రతినిధులకు ఫోన్ చేసి స్వయంగా మాట్లాడి వివరాలు అడిగినట్లు సమాచారం. ఐదుగురు ఉన్నతాధికారులతో సైతం ఇదే అంశంపై మాట్లాడినట్లు తెలుస్తోంది. మరోవైపు నేరెళ్ల వివాదం రోజురోజుకూ ముదురుతోంది. మానవ హక్కుల సంఘం, జాతీయ ఎస్సీ కమిషన్ సీరియస్‌గానే స్పందించింది. తాజాగా ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసిన కేసు విచారణ బాధ్యతలను సీఐడీకి బదలాయించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడం మరింత తీవ్రతకు దారితీస్తోంది. నేరెళ్ల వివాదం చినికిచినికి గాలివానగా మారగా.. హక్కుల సంఘాలు, కోర్టులు జోక్యం చేసుకుంటుండటం.. మరోవైపు స్వయంగా సీఎం ఆరా తీస్తున్న నేపథ్యంలో ఏం జరగబోతుందన్న చర్చ సర్వత్రా సాగుతోంది.