
సాక్షి, సూర్యాపేట : భారత్ - చైనా సరిహద్దు ఘర్షణల్లో సూర్యాపేట వాసి కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు మృతి చెందిన విషయం తెలిసిందే. సంతోష్ బాబు మృతిపై ఆయన తల్లి మంజుల స్పందించారు. తన కుమారుడు సంతోష్ బాబు దేశం కోసం పోరాడి అమరుడైనందుకు సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. ‘నా ఒక్కగానొక్క కొడుకు చనిపోవడం తల్లిగా బాధగా ఉంది. కానీ దేశం కోసం నా కుమారుడు అమరుడైనందుకు సంతోషంగా ఉంది’ అని మంజుల పేర్కొనడం ప్రతి ఒక్కరి హృదయాలను కలిచివేసింది. ఇంతటి పెను విషాదంలోనూ ఆ తల్లి ఈ విధంగా మాట్లాడడం వారి దేశ భక్తిని చాటుతోంది.
(చదవండి : చైనాతో ఘర్షణ: తెలంగాణ ఆర్మీ అధికారి మృతి)
కాగా, సంతోష్ తల్లిదండ్రులు సూర్యాపేట పట్టణంలోని విద్యానగర్‌లో నివాసం ఉండగా.. భార్య, పిల్లలు ఢిల్లీలో ఉన్నారు. తండ్రి ఉపేందర్ స్టేట్ బ్యాంకులో మేనేజర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. మూడు నెలల క్రితమే సంతోష్ హైదరాబాద్‌కు బదిలీ అయ్యారు. లాక్‌డౌన్ కారణంగా ఆయన చైనా సరిహద్దులోనే ఉండిపోయారు. సంతోష్ మరణ వార్త విని ఆయన కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. బుధవారం సాయంత్రానికి సంతోష్ బాబు భౌతికకాయాన్ని సూర్యాపేటకు చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment