‘కరోనా’ కోసం కంట్రోల్‌ రూం | Coronavirus: Special Control Rooms For Coronavirus Cases In Hyderabad | Sakshi
Sakshi News home page

‘కరోనా’ కోసం కంట్రోల్‌ రూం

Jan 31 2020 2:01 AM | Updated on Jan 31 2020 7:57 AM

Coronavirus: Special Control Rooms For Coronavirus Cases In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా వైరస్‌ కలకలం రేపుతోంది. కేరళలో ఒకరికి వైరస్‌ సోకడం, రాష్ట్రంలోనూ కరోనా అనుమానిత కేసులు నమోదు కావడంతో ప్రజల్లో భయాందోళన పెరిగింది. దీంతో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. కేంద్రం ఆదేశాల మేరకు కరోనాను ఎదుర్కొనేందుకు రాష్ట్రస్థాయిలో ఏర్పాట్లు చేసింది. కరోనా వైరస్‌ రాష్ట్ర పర్యవేక్షణాధికారి, ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాసరావు ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు అంశాలు వెల్లడించారు. వివరాలు ఆయన మాటల్లోనే..

లక్షణాలుంటే సంప్రదించండి..
కరోనా అనుమానిత లక్షణాలున్నవారు మమ్మల్ని నేరుగా సంప్రదించవచ్చు. దీని కోసం రాష్ట్రస్థాయిలో కంట్రోల్‌ రూం (040– 24651119) ఏర్పాటు చేశాం. చైనా నుంచి వచ్చిన వారు ముక్కు కారటం, జ్వరం, దగ్గు తదితర లక్షణాలుంటే ఈ నంబర్‌లో సంప్రదించాలి.

సరోజినీ ఆస్పత్రిలో ఏర్పాట్లు..
చైనాలో చదివే తెలంగాణ విద్యార్థులు ఇక్కడకు వచ్చే పరిస్థితి ఉంటే, వారిలో అనుమానిత కేసులుంటే తక్షణమే ఐసోలేషన్‌ వార్డుల్లో ఉంచడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. గాంధీ, ఫీవర్, ఛాతీ ఆస్పత్రుల్లోని 100 పడకలతో పాటు సరోజినీ కంటి ఆస్పత్రిలో 100 నుంచి 150 పడ కలను శుక్రవారం నుంచి అందుబాటులోకి తెస్తున్నాం.

గాంధీలో నిర్ధారణ పరీక్షలు
కరోనా తీవ్రత దృష్ట్యా రెండు, మూడు రోజుల్లోనే గాంధీ ఆస్పత్రిలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రం కూడా కరోనా నిర్ధారణ కిట్లను రాష్ట్రానికి పంపనుంది. అవి శుక్రవారం సాయంత్రాని కల్లా గాంధీ ఆస్పత్రికి రానున్నాయి. గాంధీలో ఉన్న మైక్రోబయాలజీ ల్యాబ్‌లో ‘కరోనా’ టెస్టులు చేపిస్తాం.

14 రోజులు పరిశీలనలో..
కరోనా అనుమానిత లక్షణా లున్న వారిని 14 రోజులపాటు ఐసోలేషన్‌ వార్డులో ఉంచాలి. ఇప్పటివరకు 11 మంది కరోనా అనుమానిత లక్షణాలున్న వారు రాష్ట్రంలో నమోదయ్యారు. వారిలో ఇద్దరికి ఎలాంటి లక్షణాలు లేవని తేలింది. ఏడుగురి రక్త నమూనాల పరీక్షల వివరాలు రావాలి. కొత్తగా ఇద్దరు చేరారు. స్వైన్‌ఫ్లూ, ఎబోలా, నిఫా వైరస్‌లతో పోలిస్తే కరోనా వైరస్‌లో మరణాల రేటు తక్కువని తేలింది. కాబట్టి ఆందోళన అవసరంలేదు.

వారిని ఇళ్లలోనే ఉంచండి..
కేంద్ర ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఆదేశాలు వస్తున్నాయి. గురు వారం కూడా కేంద్రం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించింది. జనవరి 15 తర్వాత చైనా నుంచి వచ్చిన వారందరినీ ఇళ్లలోనే 14 రోజుల పాటు ఉంచాలని కేంద్రం ఆదేశించింది. వివిధ రాష్ట్రాల ప్రభుత్వ సీఎస్‌లు, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శులు, ఇతర అధికారులతో కేంద్ర కేబినెట్‌ సెక్రటరీ రాజీవ్‌ గౌబా సుదీర్ఘ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కరోనా అంశాన్ని చాలా సీరియస్‌గా తీసుకోవాలని, కేంద్రం ఇచ్చే మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని గౌబా సూచించారు. జనవరి 15 తర్వాత తెలంగాణకు వచ్చిన వారి వివరాలను సివిల్‌ ఏవియేషన్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి సేకరిస్తున్నాం. వీడియో కాన్ఫరెన్స్‌లో మన రాష్ట్రం నుంచి సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ కూడా పాల్గొన్నారు.

వారిని పరిశీలనలో ఉంచండి: ఈటల
దేశంలో మొదటి కరోనా కేసు కేరళలో నమోదైన నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖను ఆ శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అప్రమత్తం చేశారు. చైనా నుంచి రాష్ట్రంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరినీ పరిశీలనలో ఉంచాలని, ఇంటి దగ్గర ఉన్నా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ఐసోలేషన్‌గా చికిత్స అందించేందుకు పూర్తిస్థాయిలో సన్నద్ధమై ఉండాలని అన్నారు. ఈ మేరకు మంత్రి గురువారం ఒక ప్రకటన జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement