సాయిబాబా విడుదల కోరుతూ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సాయిబాబా విడుదల కమిటీ సభ్యులు
సాక్షి, హైదరాబాద్: ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాకు సంబంధించిన నివేదికను వెల్లడించాలని ఆయన సహచరి వసంత జాతీయ మానవహక్కుల కమిషన్‌ను డిమాండ్ చేశారు. సాయిబాబా ఆరోగ్యం క్షీణిస్తోందనీ, ఆయన ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉన్నందున తక్షణమే జోక్యం చేసుకో వాలని కమిషన్‌ను వసంత గతంలో ఆశ్రయించింది. దీంతో నాగపూర్ అండాసెల్‌లో ఉన్న సాయిబాబాను జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆగస్టులో కలిసింది. అయితే, 3 నెలలు కావస్తున్నా మానవ హక్కుల కమిషన్ నివేదికను వెల్లడించలేదని వసంత ‘సాక్షి’తో మాట్లాడుతూ అన్నారు.
సాయిబాబా ఆరోగ్యానికి సంబంధించిన నిజాలు, జైలు అధికారుల కక్షసాధింపు చర్యలు బయటపడతాయనే ఆ రిపోర్టును వెల్లడించలేదని అన్నారు. ‘సాయిబాబా కార్డియో మయోపతితో బాధపడుతున్నారు, గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఉన్నాయి, 15 ఏళ్లుగా హైబీపీ ఉంది, పోలియోతో 2 కాళ్లు పూర్తిగా పనిచేయవు. వేరొకరి సాయం లేకుండా కదల్లేని పరిస్థితి. రోజుకు 8 రకాల మందులు వాడాలి. కానీ ఒక్క మందు సకాలంలో అందించడం లేదు. శరీరం 90% చచ్చుబడిపోయిన ఆయన ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నుతాడనే నెపంతో చీకటి గుహలాంటి అండాసెల్‌లో బంధించారు. ఏ నేరానికీ పాల్పడే అవకాశంలేని తను ప్రభుత్వాలను కూల్చే కుట్ర ఎలా చేస్తారో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. యుద్ధ ఖైదీలకు సైతం ఇలాంటి ట్రీట్‌మెంట్ ఉండదు.’అని వసంత ఆవేదన వ్యక్తం చేశారు. ఖైదీల పట్ల అనుసరించాల్సిన విధానాలను, అంతర్జాతీయ చట్టాలను తుంగలో తొక్కి అక్రమంగా సాయిబాబాను జైల్లో పెట్టి హింసిస్తున్నారని ఆరోపించారు.
సాయిబాబా విడుదల కోరుతూ నిరసన
‘సాయిబాబా విడుదల కోరుతూ జాతీయంగానూ, అంతర్జాతీయంగానూ అనేక చోట్ల నిరసనోద్యమాలు జరుగుతున్నాయి. న్యూయార్క్‌లో నిరసన ప్రదర్శించారు. యూరోపియన్ కాన్సులేట్ నుంచి కొందరు ఫోన్ చేసి వివరాలు తీసుకుని సంఘీభావం ప్రకటించారు. పంజాబ్, చండీగఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉద్యమాలు జరుగుతున్నాయి. మరోపక్క ఢిల్లీ యూనివర్సిటీలో సాయిబాబా సస్పెన్షన్‌పై వేసిన కమిటీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియదు. సాయిబాబా రాసిన లేఖలను మూడు, నాలుగు రోజులు జైలు అధికారులు తమ దగ్గరే ఉంచుకొని ఆ తర్వాత పోస్ట్ చేస్తున్నారు. మా క్వార్టర్ ఖాళీ చేయించారు. మాకు ఇల్లు అద్దెకు ఇవ్వడంలేదు. మానవతా దృక్పథంతో సాయిబాబాను హైదరాబాద్‌కు మార్చాలి’ అని ఆమె అన్నారు.
ప్రొఫెసర్ సాయిబాబా విడుదల కోరుతూ ఈ నెల 10న ఉస్మానియా యూనివర్సిటీలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్టు సాయిబాబా విడుదల కమిటీ నాయకులు బళ్లా రవీందర్, రవిచంద్ర, నారాయణరావు, విరసం సభ్యురాలు గీతాంజలి, ఏఐఎస్‌ఎఫ్ జాతీయ అధ్యక్షుడు వలీ ఖాద్రి తెలిపారు. సాయిబాబా, అతని సహచరుల విడుదల ఉద్యమంలో ప్రజాస్వామికవాదులు భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ సహా అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానిస్తున్నట్టు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment