మణుగూరు : మణుగూరులో పవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలనే ప్రజల చిరకాల కల నెరవేరబోతోందని, ఈ ప్రాజెక్టు వల్ల నియోజకవర్గం మరింత అభివృద్ధి సాధిస్తుందని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. మణుగూరులోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొండికుంట ప్రాంతంలో ఎప్పుడో ఏర్పాటు చేయాల్సిన ఎన్‌టీపీసీ ఇతర ప్రాంతాలకు తరలిపోయిందని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి అసెంబ్లీ సమావేశాల్లో తాను మణుగూరులో విద్యుత్ ప్రాజెక్టుకు కావాల్సిన అన్ని రకాల వసతులు బొగ్గు, రైలు మార్గం, నీటి వసతి ఉన్నాయని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానని అన్నారు.
వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ మణుగూరులో పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారని అన్నారు. మణుగూరు, పినపాక మండలాల సరిహద్దుల్లో పవర్ ప్లాంట్ ఏర్పాటుకు పనులు యుద్ధప్రాతిపదిక జరుగుతున్నాయని అన్నారు. ఎక్కడ లేని విధంగా ప్రత్యేక జీఓతో ఆర్‌ఆర్ ప్యాకేజీ ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించిందని అన్నారు. ఇప్పటికే ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాల్లో పర్యటించి అక్కడి సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లానని అన్నారు. ప్రతి కుటుంబంలో 18సంవత్సరాలు నిండినవారందరికి ప్యాకేజీ ఇస్తారని, పరిహారం రూ. 5లక్షలు ఇస్తారని అన్నారు.
నియోజకవర్గ ఎమ్మెల్యేగా తాను రైతులందరికి న్యాయం జరిగేలా చూస్తానన్నారు. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని అన్నారు. కొందరు కావాలనే రాజకీయాలు చేస్తూ ప్రాజెక్టును విచ్చిన్నం చేసేందుకు యత్నిస్తున్నారని, ప్రజలు అటువంటి వారి మాటలను నమ్మి మోసపోవద్దని అన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు కీసర శ్రీనివాసరెడ్డి, వట్టం రాంబాబు, మండల నాయకులు ఆవుల నర్సింహారాావు, మేడ నాగేశ్వరరావు, గాండ్ల సురేష్, కంచర్ల గురునాధం, ఎంపీటీసీ ఈసాల ఏడుకొండలు, శ్రీనివాస్, తిరుమలేష్, రంజిత్ పాల్గొన్నారు.
పవర్ ప్లాంట్‌తో అభివృద్ధి
Published Mon, Nov 24 2014 3:26 AM | Last Updated on Tue, Sep 18 2018 8:37 PM
Advertisement
Advertisement