
సాక్షి, హైదరాబాద్: ఏడేళ్ల వరకు జైలు శిక్షపడే నేరాల్లో తప్పనిసరిగా 41–ఏ సీఆర్‌పీసీ నోటీస్ జారీచేయాలని డీజీపీ మహేందర్‌రెడ్డి శుక్రవారం రాష్ట్ర పోలీస్ యంత్రాంగానికి సర్క్యులర్ జారీచేశారు. సీఆర్‌పీసీ 41, 41–ఏ,41–బి, 41–సీ,డీలపై శ్రద్ధచూపాలని ఆదేశించారు. అరెస్ట్ చేయకుండా సీఆర్‌పీసీ 41–ఏ కింద వ్యక్తిగత హాజరు నిమిత్తం నోటీస్ జారీచేసినప్పుడు బెయిల్ బాండ్లు, ష్యూరిటీలు అడగరాదని పేర్కొన్నారు. 41ఏ నోటీస్ జారీ గురించి జ్యుడీషియల్ మేజిస్ట్రేట్లకు ఎప్పటికప్పుడు తెలియజేయాలన్నారు.
అందుకు జిల్లా కంట్రోల్ రూమ్ పనిచేస్తుందని, దీన్ని గుర్తించేలా బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అందులో ఆ రోజు అరెస్టయిన , అరెస్టు చేసిన వారి వివరాలు పొందుపరిచి పోలీస్‌కంట్రోల్ రూమ్, కమిషనరేట్ క్రైమ్ రికార్డు బ్యూరో, జిల్లా క్రైమ్ రికార్డ్ బ్యూరోకు అందజేయాలన్నారు. ఈ వ్యవçస్థకు స్టేట్‌క్రైమ్ రికార్డ్ బ్యూరో రాష్ట్రస్థాయి కంట్రోల్ రూమ్‌గా వ్యవహరిస్తుందని, దీన్ని సీఐడీ అదనపు డీజీపీ సమన్వయం చేసుకుని, ప్రతీవారం సమీక్ష జరిపి ఐజీలకు తెలియజేయాలని డీజీపీ పేర్కొన్నారు.