- ప్రభుత్వ పాఠశాలల్లో దృశ్యశ్రవణంతో విద్యాబోధన
- ఈ నెలాఖరునుంచి అమలుకు విద్యాశాఖ నిర్ణయం
- ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ పాఠాలు
- ఆర్‌ఎంఎస్‌ఏ నుంచి రూ.50వేల చొప్పున నిధులు
- రాష్ట్రంలో మొదటిసారిగా జిల్లాలో అమలు
తాండూరు
ఎలక్ట్రాన్లు..ప్రోటాన్లు..న్యూట్రాన్లతో పరమాణువు నిర్మాణం గురించి ఉపాధ్యాయుడు బోధించినా అర్థంకాక పుస్తకాలతో విద్యార్థులు కుస్తీ పట్టే పనిలేదు. గుండె ఎలా పనిచేస్తుంది...దాని నిర్మాణం..రక్తం గుండెకు ఎలా చేరుతుంది...శరీరంలోని మిగతా భాగాలకు ఎలా పంపిస్తుందో బుర్రకు ఎక్కక జుట్టుపీక్కునే పరిస్థితి ఉండదు. పాఠ్యాంశాలను బట్టీ పట్టాల్సిన అవసరం ఉండదు. ఇలాంటి ఒత్తిళ్ల నుంచి విముక్తి కల్పించి...సులువుగా, ఆసక్తికరమైన బోధనలతో విద్యార్థుల అవగాహన పెంపొందించేందుకు జిల్లా విద్యాశాఖ సన్నాహాలు చేస్తుం ది. దృశ్యశ్రవణం ద్వారా ఉత్సాహవంతమైన వాతావరణంలో విద్యార్థుల నైపుణ్యత పెంచి, ప్రభుత్వ పాఠశాలలను మరింత పటిష్టం చేసేందుకు నడుం బిగించింది. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి విద్యాప్రమాణాలు, విద్యార్థుల సామర్థ్యాలను పెంచేందుకు జిల్లా విద్యాశాఖ కొత్తగా ప్రొజెక్టర్లతో ‘డిజిటల్ క్లాస్’ల విధానం అమలుకు సిద్ధమైంది.
]రాష్ట్రంలోనే మొదటిసారిగా జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ క్లాస్‌లకు విద్యాశాఖ అధికారులు శ్రీకారం చుడుతున్నారు. ఈ నెల చివరి నుంచి డిజిటల్ క్లాస్‌లను జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో అమలు చేయాలని జిల్లా విద్యాశాఖ హెచ్‌ఎంలకు ఆదేశాలు ఇచ్చింది. జిల్లా వ్యాప్తంగా సుమారు 480 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలున్నాయి. ఆయా పాఠశాల్లో డిసెంబర్ చివరికి డిజిటల్ క్లాస్‌లను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని డీఈఓ రమేష్ ఆదేశాలిచ్చారు. డిజిటల్ క్లాస్‌ల బోధనకు పాఠశాలల్లో ప్రత్యేకంగా ప్రొజెక్టర్లు, స్క్రీన్‌లతోపాటు అవసరమైన సాంకేతిక పరికరాల కొనుగోలుకు రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్(ఆర్‌ఎంఎస్‌ఏ) నుంచి రూ.50వేల చొప్పున నిధులను డీఈఓ కేటాయించారు. తెలుగు, గణితం, సామాన్య, సాంఘిక శాస్త్రం తదితర సబ్జెక్టుల్లోని పాఠ్యాంశాలను విద్యార్థులకు దృశ్యశ్రవణం ద్వారా బోధిం చనున్నారు.
ముఖ్యంగా ఆయా సబ్జెకుల్లో కష్టతరమైన పాఠ్యాంశాలను డిజిటల్ క్లాస్‌లో విద్యార్థులకు సులువుగా అర్థమయ్యే విధంగా దృశ్యాల రూపంలో చూపిస్తూ, ఇందు కు అవసరమైన వివరాలు ఆడియో(శ్రవణం) ద్వారా తెలియజేస్తారు. దీంతో తరగతి గదిలో ఉపాధ్యాయుడు చెప్పిన దానికంటే విద్యార్థులకు ఎంత కఠినమైన పాఠ్యాంశమైనా కదిలే దృశ్యాల ద్వారా బాగా అర్థమవుతుందని, అవగాహన, జ్ఞాపకశక్తి పెరుగుతుందని ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు.
డిజిటల్ క్లాసుల్లో చూసి న, విన్న పాఠ్యాంశాలను విద్యార్థులు ఎంత కాలమైనా వాటిని మరిచిపోయే పరిస్థితి ఉండదని ఉపాధ్యాయులు అంటున్నారు. ఈ విధానం వల్ల ప్రభుత్వ పాఠశాల్లో విద్యాప్రమాణాలు మరింత పెరుగుపడతాయనే అభిప్రాయం ఉపాధ్యాయుల్లో వ్యక్తమవుతోంది. సబ్జెకుల వారీగా నిపుణులైన ఉపాధ్యాయులతో పాఠ్యాంశాలకు సంబంధించిన క్యాసెట్లు, సీడీలను జిల్లా అధికారులు రూపొందిస్తున్నారని చెబుతున్నారు.
నెలాఖరునుంచి..
ఉన్నత పాఠశాలల్లో కొత్తగా డిజిటల్ క్లాసులను బోధించాలని డీఈఓ నుంచి ఆదేశాలున్నాయి. ఈ నెల చివరి నాటికి అమలు చేయాలని జిల్లా అధికారులు చెప్పారు. విద్యార్థుల నైపుణ్యత, సామర్థ్యాలు పెంచడమే ఈ విధానం లక్ష ్యం.
- వెంకటయ్య,హెచ్‌ఎం, తాండూరు
ప్రాక్టికల్‌గా చూపిస్తాం
గుండె ఎలా పనిచేస్తుందో తరగతిలో చెప్పిన దానికంటే దృశ్యాలతో ప్రాక్టికల్‌గా విద్యార్థులకు చూపించడం వల్ల అవగాహన స్థాయి పెరుగుతుంది. డిజిటల్ క్లాస్‌లతో విద్యార్థులు సులువుగా పట్టు సాధించేందకు దోహదపడుతుంది.
-వాసుదేవ్, టీచర్,తాండూరు
పాఠాలు మరిచిపోం...
ఆడియో, వీడియో ద్వారా పాఠాలు సులువుగా అర్థమవుతాయి. ముఖ్యంగా సామాన్య శాస్త్రా నికి సంబంధించిన పాఠ్యాంశాలు మరిచిపోకుండా డిజిటల్ క్లాస్‌ల బోధన ఉపయోగపడుతుంది.
-మణిచందన, 10వ తరగతి, పగిడ్యాల్
బట్టీకి చెక్
దృశ్యశ్రవణం ద్వారా పాఠ్యాంశాల బోధనతో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. పాఠ్యాంశాలను బట్టీ పట్టాల్సిన అవసరముండదు. డిజిటల్ క్లాసులవల్ల పాఠాలు మదిలో గుర్తుండిపోతాయి.
-నర్సింహులు, విద్యార్థి, పగిడ్యాల్
డిజిటల్ చదువులు
Published Tue, Dec 15 2015 3:21 AM | Last Updated on Fri, Sep 28 2018 3:58 PM
Advertisement
Advertisement