కార్డు మార్చాడు.. క్యాష్ కొట్టేశాడు!
చదువుకున్న వారిని చూస్తే గతంలో ఎంతో గౌరవంగా చూసేవారు. ఇప్పుడు చదువు'కొన్న' వారిని చూస్తే భయపడే పరిస్థితి దాపురించింది. సమకాలిన సమాజంలో జరుగుతున్న నేరాల్లో ఉన్నత చదువులు చదివిన వారు ఎక్కువగా ఉండడమే ఈ దుస్థితికి కారణం. ఇంజనీరింగ్ లాంటి ప్రొఫెనల్ కోర్సులు చదువుతున్న వారు నేరాల బాట పడుతుండడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. విలాసాలు, దురాలవాట్లకు బానిసలుగా మారుతున్న విద్యార్థులు ఎక్కువగా ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. ఇందుకు ఉదాహరణలివిగో...
ఏటీఎం దగ్గర సాయం అడిగిన పాపానికి ఓ ప్రభుత్వోగి రూ. లక్షలు కోల్పోయాడు. ఇంజనీరింగ్ చదువుతున్న ఓ విద్యార్థి చేతిలో మోసపోయిన అతడు పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బీఎస్ఎన్ఎల్ ఆఫీసులో డ్రైవర్ గా పనిచేస్తున్న సంగారెడ్డి మఖ్దుంనగర్ కు చెందిన బురానొద్దీన్.. మే నెలలో సంగారెడ్డి ఎస్బీహెచ్ ఏటీఎంలో డబ్బు డ్రా చేసేందుకు వెళ్లాడు. కార్డు సరిగా పనిచేయకపోవడంతో పక్కనే ఉన్న లక్న కృపారావు(21)ను సాయమడిగాడు. డబ్బు తీసిచ్చిన తర్వాత అతడి కార్డుకు బదులు తన ఏటీఎం కార్డు బురానొద్దీన్ కు ఇచ్చాడు.
బురానొద్దీన్ కార్డుతో అతడి ఎకౌంట్ లోని లక్షలాది రూపాయలు డ్రా చేశాడు. తన ఖాతాలో రూ. 8 లక్షలకు కేవలం రూ.1.18 లక్షలు మాత్రమే మిగలడంతో కంగుతిన్న బురానొద్దీన్ పోలీసులను ఆశ్రయించాడు. శేరిలింగంపల్లిలో కృపారావును అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా కోటప్పకొండకు చెందిన కృపారావు పటాన్చెరులోని ఓ కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు.
అవసరానికి ఆదుకున్న వ్యక్తి బ్యాంకు ఎకౌంట్ వివరాలు రహస్యంగా వాడుకుని రూ.1.15 లక్షల ఆన్లైన్ షాషింగ్ చేసిన బేతపూడి క్రేసీ ఏంజెలినా అనే ఎంటెక్ విద్యార్థిని పేట్ బషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీడ్ ప్రొడక్షన్ కంపెనీలో పనిచేస్తున్న నాగరాణి మహాజన్ తనతో కలిసి ఫ్లాట్ లో నివసించిన ఏంజెలినాకు అవసరం కోసం గతేడాది నవంబర్ లో తన బ్యాంకు ఎకౌంట్ వివరాలిచ్చింది. వీటిని రహస్యంగా వాడుకుని ఏంజెలినా ఆన్లైన్ షాపింగ్ చేసింది. మోసాన్ని గుర్తించిన మహాజన్ పోలీసులను ఆశ్రయించడంతో ఏంజెలినాను అదుపులోకి తీసుకున్నారు.