- అసెంబ్లీలో మహిళా సభ్యుల వాగ్వాదం
- లాబీల్లోకి మద్యం వ్యాపారిని తెచ్చారన్న డీకే అరుణ
- మైనింగ్ అక్రమాలపై ఏమంటారంటూ నిలదీసిన సునీత
సాక్షి, హైదరాబాద్: శాసనసభలో బుధ వారం అధికార, విపక్ష సభ్యులు గొంగిడి సునీత, డీకే అరుణ మధ్య తీవ్రస్థాయి వాగ్యుద్ధం జరిగింది. ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు గుప్పించుకోవడంతో బుధవారం సభ కొద్దిసేపు అట్టుడికింది. జీరో అవర్‌లో కాంగ్రెస్ సభ్యురాలు డీకే అరుణ ప్రస్తావించిన అంశంపై మాట్లాడేందుకు టీఆర్‌ఎస్ సభ్యురాలు సునీతకు స్పీకర్ అవకాశమిచ్చారు. అయితే తమకు మరోసారి అవకాశం ఇవ్వాలంటూ కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. అయినా స్పీకర్ అనుమతించకపోవడంతో వారంతా వాకౌట్ చేసి నిరసన తెలిపారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు.. ఓ మద్యం వ్యాపారిని అసెంబ్లీ లాబీల్లోకి తీసుకొచ్చి మంత్రిని కలిపించారన్న అంశాన్ని జీరో అవర్‌లో డీకే అరుణ లేవనెత్తారు. దీనిపై విచారణ జరిపించాలని కోరారు. ఈ సమయంలో ఎక్సైజ్ మంత్రి పద్మారావు కల్పించుకుని, పత్రికల్లో వచ్చిన వార్తను పట్టుకొని ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు.
‘నేనేమైనా వారికి వత్తాసు పలికానా.. పత్రిక కథనాన్ని పట్టుకుని నన్ను అంటారా’ అని అడిగారు. ఇదే సమయంలో తనకు అవకాశమివ్వాలని గొంగిడి సునీత లేవగా స్పీకర్ అనుమతించారు. ఆమె మాట్లాడుతూ ‘మద్యం వ్యాపారిని తీసుకొచ్చినట్లు నిరూపిస్తారా? ఆ రోజు వచ్చింది ప్రైవేటు పీఆర్‌వో మాత్రమే. ఆరోపణలు చేసేప్పుడు అరుణ అన్నీ తెలుసుకుని మాట్లాడాలి. అరుణకు సంబంధించి కూడా అక్రమ మైనింగ్ చేస్తున్నారని పత్రికలో వార్త వచ్చింది. అది నిజమే అనుకోవాలా’ అని ఎదురుదాడికి దిగారు. తాము పోరాటాలు చేసి అధికారంలోకి వచ్చామని, అక్రమ మైనింగ్ చేసి రాలేదని అన్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు నిరసనకు దిగారు. తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని స్పీకర్‌ను డీకే అరుణ కోరారు.
అయితే మైక్ ఇచ్చేందుకు ఆయన నిరాకరించడంతో ఆమె పోడియం ముందుకు దూసుకొచ్చారు. ఆమెకు మద్దతుగా మిగతా సభ్యులు సైతం పోడియంలోకి వచ్చి మైక్ కోసం పట్టుబట్టారు. ఆరోపణలు, ప్రత్యారోపణలు ఉంటే రికార్డ్స్ నుంచి తొలగిస్తామని స్పీకర్ చెప్పినా సభ్యులు వినిపించుకోలేదు. దీంతో ఆయన టీ విరామం ప్రకటించారు. సభ తిరిగి ఆరంభమయ్యాక సైతం కాంగ్రెస్ సభ్యులు నిరసనకు దిగారు. అరుణకు ఒక్క నిమిషం అవకాశ మివ్వాలని ప్రతిపక్ష నేత జానారెడ్డి కూడా కోరారు. దీనిపై మంత్రి హరీశ్‌రావు జోక్యం చేసుకుంటూ జీరో అవర్‌లో మాట్లాడిన అభ్యంతరకర వ్యాఖ్యలను తీసేస్తామని స్పీకర్ చెప్పినందున కాంగ్రెస్ సభ్యులు సభకు సహకరించాలని కోరారు. అయినా కాంగ్రెస్ సభ్యులు స్పీకర్‌తో వాగ్వాదానికి దిగారు. అనంతరం జానా లేచి ప్రభుత్వ వైఖరికి నిరసనగా వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. అందరూ సభ నుంచి బయటకు వెళ్లిపోయారు.