తన స్నేహితుడు జీపీ రెడ్డిని అరెస్ట్ చేయకుండా బెడ్‌పైనే బైఠాయించిన లగడపాటి
హైదరాబాద్: ఫోర్జరీ పత్రాలతో ఖరీదైన స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నించిన కేసులో నిందితుడిని అరెస్ట్ చేసేందుకు వెళ్లిన బంజారాహిల్స్ పోలీసులను మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అడ్డుకుని హైడ్రామా సృష్టించారు. వారంట్ లేకుండా అరెస్ట్ ఎలా చేస్తారంటూ వాగ్వాదానికి దిగడంతో పాటు రాత్రంతా నిందితుడి ఇంట్లోనే ఉన్నారు. ఈ ఘటన జూబ్లీహిల్స్‌లో కలకలం సృష్టించింది. బంజారాహిల్స్ రోడ్ నం.12లోని కమాన్ లోపల షేక్‌పేట మండలం పరిధిలోని సర్వే నం. 120/30లో ఉన్న స్థలానికి సంబంధించి చాలా ఏళ్లుగా వివాదం నడుస్తోంది.
ఈ స్థలం ఉమెన్ కో ఆపరేటివ్ సొసైటీకి కేటాయించగా, ప్లాట్లుగా చేసి పలువురికి విక్రయించారు. కాగా జూబ్లీíహిల్స్ రోడ్ నం.65లో ఉండే గోడి పిచ్చిరెడ్డి అలియాస్ జీపీ రెడ్డి ఈ స్థలానికి ఫోర్జరీ పత్రాలను సృష్టించి కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారంటూ ఎం.కృష్ణారెడ్డి 2016లో బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉమెన్ కో ఆపరేటివ్ సొసైటీకి చెందిన కల్పన నుంచి ఈయన ఈ స్థలానికి జీపీఏ పొందారు. ఈ కేసులో నిందితులైన ఆరుగురిని గత యేడాది డిసెంబర్‌లో అరెస్ట్ చేయగా, కీలక సూత్రధారి పిచ్చిరెడ్డి అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టును ఆశ్రయించి అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ పొందారు.
ఏసీబీ దర్యాప్తు చేపట్టాలన్న హైకోర్టు...
ఫిర్యాదుదారులు హైకోర్టును ఆశ్రయించడంతో బెయిల్ రద్దు చేయడంతోపాటు ఏసీబీ దర్యాప్తు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో పిచ్చిరెడ్డి అజ్ఙాతంలోకి వెళ్లారు. గురువారం రాత్రి జూబ్లీహిల్స్‌లోని ఇంటికి నిందితుడు వచ్చినట్లు తెలియడంతో పోలీసులు అక్కడికి చేరుకుని స్టేషన్‌కు రావాలని కోరారు. బట్టలు మార్చుకుని వస్తానంటూ లోనికి వెళ్లిన పిచ్చిరెడ్డి తన స్నేహితుడైన లగడపాటికి ఫోన్ చేశారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో లగడపాటి అక్కడకు చేరుకున్నారు. స్థల (సివిల్) వివాదంలో పోలీసులు ఎందుకు కలుగజేసుకుంటున్నారంటూ హుంకరించారు. 5 నెలల క్రితం నుంచి పరారీలో ఉన్న నిందితుడిని అరెస్ట్ చేయడానికి వారెంట్ అవసరం లేదని ఎస్‌ఐలు శ్రీనివాస్, పీడీ నాయుడు లగడపాటికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు.
మీడియాను పిలిపిస్తానంటూ బెదిరింపులకు దిగారు. ఉదయాన్నే తాను పిచ్చిరెడ్డిని తీసుకువచ్చి అప్పగిస్తానంటూ చెప్పారు. ఇదే విషయాన్ని కాగితంపై రాసిస్తే తాము వెళ్లిపోతామని పోలీసులు అన్నారు. అయితే పేపర్‌పై రాసివ్వను.. అరెస్ట్ చేయనివ్వను.. అని రాజగోపాల్ భీష్మించుకుని కూర్చున్నారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న మీడియా ప్రతినిధుల ముందు లగడపాటి మరోసారి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం వేశారు. తనను దాటి వచ్చి అరెస్ట్ చేయాలంటూ సవాల్ విసిరి బెడ్రూమ్‌లోకి వెళ్లి పిచ్చిరెడ్డి నిద్రిస్తుండగా పక్కనే కూర్చున్నారు. తాము వెళ్లిపోతే పిచ్చిరెడ్డి పారిపోతారని పోలీసులు కూడా అతని ఇంటి వద్దే కూర్చున్నారు. తెల్లవారుజాము 6గంటల దాకా ఇదే హైడ్రామా సాగింది.
ఐజీ నాగిరెడ్డి ఒత్తిడితోనే...
ఉదయం 7గంటల తర్వాత లగడపాటి మళ్లీ పోలీసులపై ఆరోపణలు కొనసాగించారు. ఈ కేసు సివిల్ వ్యవహారం అని ఐజీ నాగిరెడ్డి ఒత్తిడితోనే అర్ధరాత్రి పోలీసులు ఇంటిపైకి వచ్చారని అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికలు వచ్చిన కారణంగా ఎవరూ బదిలీ చేయరన్న ధీమాతో ఏమైనా చేయవచ్చని అనుకుంటున్నారా అని నిలదీశారు. పోలీసులకు ఎవరిపైనైనా కేసులు పెట్టే అధికారం ఉందని కానీ విస్తృత అధికారాలు ఉపయోగించి ఎవరినైనా అరెస్ట్ చేయాలని అనుకుంటే కుదరదని హెచ్చరించారు.
జూబ్లీహిల్స్ రోడ్ నం.12లో ఐపీఎస్ అధికారికి చెందిన భూమికి తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించారని పోలీసు కేసు ఉందని, ఈ విషయమై జీపీ రెడ్డి 20 సార్లు స్టేషన్‌లో హాజరయ్యారన్నారు. ఈ వ్యవహారాన్ని నాగిరెడ్డితో సెటిల్ చేసుకోవాలని పోలీసులు తన స్నేహితుడిని వేధిస్తున్నారన్నారు. ఈ సోదాల వెనుక నాగిరెడ్డితో పాటు ఓ డీసీపీ ఉన్నారని దీనిపై గవర్నర్, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందంటూ ఉన్నతాధికారులు చెప్పడంతో పోలీసులు వెనుదిరిగారు.
జీపీ రెడ్డిపై లుక్ అవుట్ నోటీసు..
సుమారు రూ.300 కోట్ల విలువైన స్థలానికి సంబంధించి ఫోర్జరీ పత్రాలను తయారు చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రియల్టర్ జీపీ రెడ్డిపై గతంలో కూడా పలు ఆరోపణలు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. బెంగళూరు కేంద్రంగా పలు వివాదాల్లో పిచ్చిరెడ్డి పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో 5 నెలలుగా పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న ఆయనపై విదేశాలకు పారిపోకుండా లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి.
లగడపాటి వ్యాఖ్యల్లో వాస్తవం లేదు
తాము కూడా బాధితులమేనన్న ఐజీ నాగిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని ఉమెన్ కో–ఆపరేటివ్ సొసైటీ వివాదం నేపథ్యంలో తనను ఉద్దేశించిన లగడపాటి చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఐజీ వై.నాగిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఆ సొసైటీలో సభ్యురాలిగా ఉన్న తన సమీప బంధువు పల్లంరెడ్డి హంసమ్మ స్థలం ఖరీదు చేసి మోసపోయారని, ఈ నేపథ్యంతో తమ కుటుంబమూ బాధితులుగా మారిందని ఆయన వివరించారు.
ఈ కేసు దర్యాప్తు తదనంతర చర్యల్లో రెండేళ్లు జాప్యం జరిగి, నిందితుడు మరికొన్ని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినప్పటికీ ఏ దశలోనూ తాను జోక్యం చేసుకోలేదని స్పష్టం చేశారు. జీపీ రెడ్డిని కానీ, ఆయన అల్లుడిని కానీ కలవడం, మాట్లాడటం జరగలేదని పేర్కొన్నారు. వారిని బెదిరించానంటూ లగడపాటి చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేదన్నారు. చట్ట ప్రకారం స్థానిక పోలీసులు తీసుకున్న చర్యల్ని తనకు ఆపాదించడం సబబుకాదన్నారు. పోలీసులు న్యాయం చేస్తారనే ఉద్దేశంతో సొసైటీ సభ్యులు రెండేళ్లుగా ఎదురు చూస్తున్నారని నాగిరెడ్డి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment