సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ బిర్యానీ అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి. ఎక్కడి వారైనా లొట్టలేసుకుంటూ తింటారు. అంతేకాదు హైదరాబాద్‌లోని ఆహార పరిశ్రమపై ఆధారపడి లక్ష కుటుంబాలు బతుకుతున్నాయి. మూడు లక్షల మందికి పైగా ఈరంగంలో పనిచేస్తున్నారు. ప్రతిరోజూ 700 టన్నుల చికెన్, 291 టన్నుల మాంసం వినియోగమవుతోంది. ప్రత్యేక సందర్భాల్లో ఇంతకు రెండు మూడు రెట్లు వినియోగిస్తారు. ఫుట్‌పాత్ మీది బండ్ల నుంచిసెవెన్‌స్టార్ హోటళ్ల వరకున్నాయి. బిర్యానీతోపాటు ఇరానీ చాయ్, హలీంలతోనూ ఈ నగరం ఎంతో ప్రత్యేకతను సాధించుకుంది. వీటితో సహ వివిధ అంశాల ప్రాతిపదికగా యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్‌వర్క్‌కు అర్హత పొందింది. గ్యాస్రోనమీ(ఆహార సంబంధ) విభాగంలో నగరం ఇందుకు ఎంపికైంది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఘనత వహించిన మహానగరంలో ఆహారం రుచికరమే కానీ.. ఫుడ్‌సేఫ్టీ మాత్రం కరువైంది.
తనిఖీలు నిల్
నిబంధనల మేరకు హోటళ్లతో సహ ఆహార పరిశ్రమల్లో నిర్ణీత వ్యవధుల్లో తనిఖీలు జరగాల్సి ఉండగా జరగడం లేవు. ప్రతినెలా శాంపిళ్లను తీసి పరీక్షలు చేయించాల్సి ఉండగా, అది జరుగుతుందో లేదో తెలియదు. నిర్ణీత వ్యవధిలో ల్యాబ్‌కు పంపేందుకు సరిపడా యంత్రాంగం కూడా లేదు. ఎక్కడ పడితే అక్కడ దొరికే ఆహారంతోపాటు స్టార్ హోటళ్లలోనూ శుచిశుభ్రతకు పూచీ లేదు. దాదాపు ఏడాదిన్నర క్రితం జీహెచ్‌ఎంసీ హోటళ్ల తనిఖీల స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. శుభ్రత కనిపించని వంటగదులు, కుళ్లిన మాంసాన్నే వినియోగించడం, తినడానికి యోగ్యం కాని ఆహారాన్ని వడ్డించడం వంటివి గుర్తించారు. జరిమానాలు విధించారు. ఇకపై సహించబోమని హెచ్చరించారు. ఆ తర్వాత కూలబడ్డారు. కారణం జీహెచ్‌ఎంసీలో ఉండాల్సినంతమంది ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు లేరు. నగరంలో రిజిస్టరైన రెస్టారెంట్లు 2200 కాగా, టిఫిన్ బండ్ల నుంచి పెద్ద హోటళ్ల వరకు దాదాపు 80 వేలు ఉంటాయని అంచనా.
యంత్రాంగం లేదు..
♦ జీహెచ్‌ఎంసీలోని 30 సర్కిళ్లలో 30 మంది ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు, ఆరు జోన్లకు ఆరుగురు డిజిగ్నేటెడ్ ఆఫీసర్లు, జీహెచ్‌ఎంసీ మొత్తానికి ఒక అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ ఉండాలి. కానీ ప్రస్తుతం ముగ్గురు గెజిటెడ్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు, అసిస్టెండ్ ఫుడ్ కంట్రోలర్ మాత్రం ఉన్నారు. గ్రేటర్ నగరంలోని అన్ని హోటళ్లతో పాటు తినుబండారాల దుకాణాల తనిఖీలు తదితరమైన బాధ్యతలు వీరివే. ఇక కోర్టు కేసులూ తదితరమైనవి సరేసరి.
♦ 2011లో ఫుడ్‌సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ వచ్చినప్పటికీ,నగరంలో ఇది అమలవుతున్న దాఖలాల్లేవు. దీని మేరకు ప్రతి తినుబండారాల దుకాణం వివరాలతో కూడిన ఆన్‌లైన్ జాబితా ఉండాలి. నిర్ణీత వ్యవధుల్లో తనిఖీలు.. తగినన్ని కల్తీపరీక్షల కేంద్రాలు.. కల్తీని బట్టి కఠినచర్యలు ఉండాలి. జీహెచ్‌ఎంసీలో ఏఎంఓహెచ్‌లున్నా వారు ఫుడ్‌సేఫ్టీ గురించి పట్టించుకోవడం లేరు.
అప్పుడు హడావుడి.. తర్వాత కూలబడి..
2017 ఏప్రిల్‌లో దాదాపు నెల రోజుల పాటు హోటళ్లలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. దాదాపు 400 హోటళ్లు తనిఖీలు చేసి 200కు పైగా హోటళ్లకు దాదాపు రూ. 17 లక్షల జరిమానాలు విధించారు. ఆతర్వాత మరచిపోయారు. 2015లో 413 శాంపిళ్లు సేకరించి 42 కేసులు, 2016లో 461 శాంపిళ్లు సేకరించి 63కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియదు.
♦ హోటళ్ల తనిఖీలకు ప్రత్యేక యాప్‌ను తెస్తున్నామన్నారు. హోటళ్లలో ఏవి లోపిస్తే ఎంత జరిమానా విధించాలో అందులో ఉంటుందని, విస్తృతంగా తనిఖీలు చేసి ప్రజారోగ్యానికి భరోసాగా ఉంటామన్నారు. అనంతరం ఏంచేశారో అధికారులకే తెలియాలి.
ఉక్కుపాదం కాదు.. ఉత్తిమాటలు..
హోటళ్లలో కల్తీపై ఉక్కుపాదం మోపుతామని అధికారులు అప్పట్లో ప్రకటించారు. జీహెచ్‌ఎంసీ, పోలీసు విభాగాలు సంయుక్తంగా తనిఖీలు చేపట్టాలని భావించారు. ప్రజలకు ఆరోగ్యభద్రత కల్పించేందుకు హోటళ్ల నిర్వహణ సక్రమంగా లేకుంటే పెనాల్టీలునిర్ణయించారు.
రిపోర్టుల కోసం ..
బేగంపేట మానససరోవర్ హోటల్‌లోని ఆహారం వల్లే రెండేళ్ల బాలుడు తీవ్ర వాంతులతో మృతి చెందాడనే ఆరోపణలు వెల్లువెత్తడం తెలిసిందే. హోటల్‌లోని ఆహారం శాంపిల్స్‌ను పరీక్షల కోసం పంపిన అధికారులు రిపోర్టుల కోసం వేచి చూస్తున్నారు. మరోమారు తనిఖీల హడావుడి చేస్తున్నారు.
పెనాల్టీలు ఇలా... దేనికి ఎంత (రూ.లు)
♦ కిచెన్ శుభ్రంగా లేకుంటే: 500
♦ సిబ్బంది దుస్తులు శుభ్రంగా లేకుంటే,చేతులకు గ్లవ్స్ లేకుంటే: 500
♦ అపరిశుభ్ర, పగిలిన పాత్రలు వినియోగిస్తే : 500
♦ కిచెన్లో వెంటిలేషన్,లైటింగ్ లేకుంటే: 500
♦ వెజ్,నాన్‌వెజ్ పదార్థాలు కలిపి నిల్వచేస్తే: 500
♦ తాగునీరు లేకుంటే: 1000
♦ టాయ్‌లెట్లు లేకుంటే 2000
♦ డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకుంటే : 2000
♦ ఫైర్‌సేఫ్టీ ఏర్పాట్లు,ఎగ్జిట్ లేకుంటే :10000
♦ ట్రేడ్‌లైసెన్స్ ప్రదర్శింకుంటే: 520
♦ వీటితోపాటు ఇంకా పలు అంశాలకు నిర్ణీత జరిమానాలను నిర్ణయించారు. యాప్‌ద్వారా ఆయా ఉల్టంఘనలకు ఆటోమేటిక్‌గా జరిమానాలు పడతాయన్నారు. అధికారుల విచక్షణతో జరిమానాల్లో వ్యత్యాసాలుండవన్నారు. కానీ.. ఏం చేస్తున్నారోవారికే తెలియాలి.
♦ కొన్ని హోటళ్లతో నెలనెలా మామూళ్లకు లాలూచీ పడుతున్నారన్న ఆరోపణలున్నాయి. అధికారుల తీరు చూసి దిగువ ఉద్యోగులు సైతం ఆయా హోటళ్లనుంచి పార్సిళ్లు తెప్పించుకుంటారనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో అలాంటి హోటళ్లపై చర్యలు తీసుకోలేకపోతున్నారు.
♦ ఏటా కల్తీ ఆహారంతో అనారోగ్యం బారిన పడుతున్నవారు దాదాపు: 40,000
♦ టీఎస్‌పీఎస్‌సీ త్వరలో భర్తీ చేయనున్న ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్ల పోస్టులు :26
Comments
Please login to add a commentAdd a comment