కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మహ్మద్‌పురలో గ్యాస్ సిలిండర్ పేలి తండ్రీకూతురు మృతి చెందారు.
తండ్రి వికలాంగుడు... కూతురు మానసిక రోగి
కరీంనగర్‌లో ఘటన
కరీంనగర్: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మహ్మద్‌పురలో గ్యాస్ సిలిండర్ పేలి తండ్రీకూతురు మృతి చెందారు. నగరంలోని మంగళవాడకు చెందిన కూర ప్రభాకర్(65), అతడి కుమార్తె పద్మ(35) ఇద్దరు నగరంలోని పాత శిశుమందిర్ వద్ద మిర్చిబండి నిర్వహిస్తున్నారు. ప్రభాకర్ వికలాంగుడు కాగా, పద్మ మానసిక వ్యాధితో బాధ పడుతోంది. అయినప్పటికీ వీరు తమ కాళ్లపై తాము జీవిస్తుండగా, చివరికి తాము నమ్ముకున్న జీవనోపాధే బలిగొన్నది. మిర్చిబండికి అవసరమైన వంట సామగ్రి తయారీ కోసం మహ్మద్‌పురలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. శనివారం మధ్యాహ్నం ప్రభాకర్, పద్మ కలిసి అక్కడ వంటకాలు తయారు చేస్తున్నారు.
ఈ క్రమంలో గ్యాస్ రెగ్యులేటర్ ఒక్కసారిగా ఎగిరిపోవడంతో పాటు స్టవ్ మీద ఉన్న వేడినూనె, నీళ్లు వీరిపై పడ్డాయి. నూనెకు మంటలు అంటుకుని పెద్ద శబ్దంతో సిలిండర్ పేలిపోయింది. ఇంటి పై కప్పుకు రంధ్రం పడింది. ప్రభాకర్ మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే మృతిచెందాడు. పద్మ తీవ్రంగా గాయపడింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. పద్మను ఆస్పత్రికి తరలించగా సాయంత్రం ఆరు గంటలకు మృతి చెందింది.