
ఒక్క రూపాయికే టిఫిన్!!
ఒక రూపాయి పెడితే ఏమొస్తుంది.. మహా అయితే ఒక మంచినీళ్ల ప్యాకెట్ వస్తుందేమో. అది కూడా అన్ని చోట్లా కాదు. ఆర్టీసీ బస్టాండ్ల లాంటి చోట్ల అయితే.. మూడు రూపాయలు కూడా అవుతుంది. కానీ, జీహెచ్ఎంసీ పరిధిలో త్వరలోనే పేదలు, బడుగు జీవులకు ఒక్క రూపాయికే ఉదయపు అల్పాహారాన్ని అందించబోతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ - సికింద్రాబాద్ జంటనగరాల్లోని 8 కేంద్రాల్లో ఐదు రూపాయలకే మధ్యాహ్న భోజనం అందిస్తున్న జీహెచ్ఎంసీ.. ఈ పథకానికి హరేకృష్ణ ఫౌండేషన్ సహకారం తీసుకుంటోంది.
పూరీ, ఇడ్లీ, ఉప్మా లాంటి అల్పాహారాలను కూడా ఇక నుంచి ఒక్క రూపాయికే అందించాలని జీహెచ్ఎంసీ నిర్ణయం తీసుకున్నట్లు కమిషనర్ సోమేష్కుమార్ సోమవారం వెల్లడించారు. ఐదు రూపాయల భోజన పథకానికి సంబంధించి తాము ఇప్పటికే 8 కేంద్రాలు తెరిచామని, మరో 42 కేంద్రాలు కూడా తెరవాల్సి ఉందని, త్వరలోనే టిఫిన్ పథకాన్ని ప్రారంభిస్తామని ఆయన అన్నారు. నిరుపేదలకు ఆరోగ్యకరమైన, వేడివేడి ఆహారాన్ని అందించాలన్న ఉద్దేశంతోనే ఈ పథకాలను చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.