
గుండె మండి ‘పంట’కు మంట!
పరిగి: రైతు ఉత్పత్తులకు గిట్టుబాటుధరలు కల్పించాలని రైతు కిసాన్‌సంఘ్ రాష్ట్ర కన్వినర్ అందె విజయ్‌కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాబయ్య అన్నారు. శుక్రవారం రైతు కిసాన్‌సంఘ్ ఆధ్వర్యంలో పరిగి వ్యవసాయ మార్కెట్లో గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. పత్తి, మొక్కజొన్నలు తగులబెట్టి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వ్యవసాయ మార్కెట్లో అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోజురోజుకు రైతుల ఉత్పత్తులకు ధరలు తగ్గుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటంలేదని ఆరోపించారు. సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం నామ్‌కే వాస్తేగా మారిందన్నారు. దళారులకే దన్నుగా నిలుస్తున్నారని తెలిపారు.
పత్తికి రూ. 5000, వరికి రూ.1400, మొక్కజొన్నలకు రూ.1310 కి తక్కువ కాకుండా కొనుగోలు చేయాలని తెలిపారు. దళారుల బారినుండి రైతులను రక్షించాలన్నారు. పరిగి వ్యవసాయ మార్కెట్‌లో తీవ్ర అవకతవకలు చోటుచేసుకుంటున్నా అధికారులు పట్టించుకోవటంలేదన్నారు. అనావృష్టి కారణంగా ఈ సంవత్సరం నియోజకవర్గ రైతులు తీవ్ర నష్టం వచ్చిందని పేర్కొన్నారు. మద్దతు ధరలు పెంచి రైతులను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. మార్కెట్లో రైతులకు తప్పనిసరిగా తక్‌పట్టీలు ఇచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. తక్‌పట్టీలు ఇవ్వని కారణంగా రైతులు బీమా సౌకర్యం కోల్పోతున్నారని తెలిపారు. పత్తి కొనుగోలు కేంద్రం పరిగిలోనే ఏర్పాటు చేయటంతో పాటు తూకాలు కూడా ఇక్కడే నిర్వహించాలని కోరారు...ఈ కార్యక్రమంలో ఆయా రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు.