భాగ్యనగరం.. విశ్వనగరం చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం.. అందుకే పాలకులు అభివృద్ధి కోసం వందల కోట్ల రూపాయలు ఖర్చుచేశారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, జలమండలి హైదరాబాదును అద్భుతంగా తీర్చిదిద్దాలని ప్రణాళికలు రూపొందించి సఫలీకృతమయ్యాయి. నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ అంటే ముందుకు మనకు గుర్తుకొచ్చేది ట్రాఫిక్ సమస్య. అందుకే ఈ సమస్యను పరిష్కరించేందుకు జీహెచ్‌ఎంసీ నడుం బిగించింది. అందుకు ఫ్లై ఓవర్లను నిర్మించింది. ఎల్‌బీనగర్ చింతల్‌కుంట జంక్షన్ అండర్‌పాస్, కామినేని వద్ద రెండు ఫ్లై ఓవర్లు, అయ్యప్పసొసైటీ అండర్‌పాస్, మైండ్‌స్పేస్ జంక్షన్ అండర్‌పాస్, ఫ్లై ఓవర్, ఎల్‌బీనగర్ ఫ్లై ఓవర్, అండర్‌పాస్, రాజీవ్‌గాంధీ విగ్రహం వద్ద ఫ్లై ఓవర్, బయోడైవర్సిటీ వద్ద రెండు ఫ్లై ఓవర్లు ఇప్పటికే వినియోగంలోకి వచ్చాయి. ఎవరూ ఊహించని విధంగా వేగంగా పూర్తయిన ఈపనులతో ప్రజల ట్రాఫిక్ చిక్కులు కొంతమేర తీరాయి. మరిన్ని ప్రాజెక్టులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి.
♦ జీహెచ్‌ఎంసీ పరిధిలో 109 ప్రాంతాల్లో రూ.8,541 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన లక్ష డబుల్ బెడ్‌రూం ఇళ్ల పనులు పురోగతిలో ఉన్నాయి. వీటిని దసరా నాటికి పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
♦ టీఆర్‌ఎస్ ప్రభుత్వం పేదల కోసం ప్రారంభించిన రూ. 5 భోజన పథకం ద్వారా ఇప్పటి వరకు 5.5 కోట్ల భోజనాలు అందజేసింది. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో సీఎం ఇచ్చిన హామీ మేరకు 24 వేల మంది జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు, డ్రైవర్ల వేతనాలను ప్రభుత్వం పెంచింది.
♦ పేదల కోసం ఐదు మల్టీ పర్పస్‌ఫంక్షన్ హాళ్ల నిర్మాణం పూర్తికాగా మరో పది పురోగతిలో ఉన్నాయి. 35 మోడల్ మార్కెట్లు నిర్మించారు.
♦ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భాగంగా జీహెచ్‌ఎంసీ సాంకేతిక వినియోగంలో ఇతర శాఖల కన్నా అగ్రస్థానంలో ఉంది. హైదరాబాద్ నగరంలో ప్రతిష్టాత్మకంగా రూ.271 కోట్లతో చేపట్టిన ఎల్‌ఈడీ లైట్ల
♦ ప్రాజెక్టుతో దేశంలోనే పేరుపొందింది. దీని వల్ల ఏటా రూ. 113 కోట్ల విద్యుత్‌చార్జీలు ఆదా అవుతున్నాయి.
♦ ఇకనుంచి ఐదేళ్లపాటు రూ. 50వేల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ బాధ్యత మరింతగా పెరగనుంది.
దాహం.. దూరం
గ్రేటర్‌లో గత ఆరేళ్లుగా కీలక మంచినీటి పథకాల పూర్తితో దాహార్తి సమూలంగా దూరమైంది. నగరానికి సింగూరు, మంజీరా జలాల సరఫరా నిలిచిపోవడంతో.. గోదావరి మొదటి దశపథకాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తిచేయడంతోపాటు, కృష్ణా మూడోదశ పథకాల పూర్తితో మహానగరానికి నిత్యం ఈ రెండు జలాశయాల నుంచి సుమారు 480 మిలియన్‌గ్యాలన్ల తాగునీటిని జలమండలి తరలించి శుద్ధిచేసి నగరంలోని 10.60 లక్షల నల్లాలకు సరఫరా చేసే అవకాశం లభించింది.
♦ గోదావరి జలాలను నగరం నలుమూలలకు సరఫరా చేసేందుకు రింగ్‌మెయిన్ 1,2 పనులను చేపట్టడంతో శివార్ల దాహార్తి సమూలంగా తీరింది.
♦ సుమారు రూ.1800 కోట్ల హడ్కో నిధులతో చేపట్టిన పట్టణ మిషన్ భగీరథ పథకంలో భాగంగా సుమారు 2500 కి.మీ మార్గంలో నూతన తాగునీటి సరఫరా పైపులైన్ల ఏర్పాటు, సుమారు 60 భారీ స్టోరేజి రిజర్వాయర్ల నిర్మాణంతో శివార్లలో నివసిస్తున్న లక్షలాది మందికి కన్నీటి కష్టాలు తీరాయి.
♦ రూ.750 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఓఆర్‌ఆర్ తాగునీటి పథకం పూర్తితో ఔటర్‌రింగ్ రోడ్డులోపలున్న 190 గ్రామపంచాయతీలు, నగరపాలక సంస్థలకు తాగునీటి గోస తీరింది.
♦ తాజాగా ప్రభుత్వం ప్రారంభించిన కొండపోచమ్మ సాగర్‌తో సమీప భవిష్యత్‌లో గ్రేటర్ నగరానికి ఏటా సుమారు 10 టీఎంసీల గోదావరి జలాలను అందించే అవకాశం లభించనుంది.
♦ మురుగు అవస్థలు తీర్చేందుకు సుమారు రూ.2800 కోట్లతో చేపట్టిన సీవరేజ్ మాస్టర్‌ప్లాన్ పనులు సైతం త్వరలో పట్టాలెక్కనున్నాయి.
‘మహా’ మార్క్
హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) రూ.700 కోట్లతో అభివృద్ధి ప్రాజెక్టులు పట్టాలెక్కించింది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదిత ప్రాజెక్టులకు మోక్షం కలిగిస్తూ హెచ్‌ఎండీఏ సొంత ఆదాయంతోనే ఆ పనులు చేపట్టింది. గత ఆరేళ్లుగా విశ్వనగరాభివృద్ధిలో హెచ్‌ఎండీఏ తనదైన మార్క్‌తో ముందుకెళుతోంది.
♦ రూ.384 కోట్లతో బాలానగర్ ఫ్లైఓవర్ పనులు కొనసాగుతుండగా... వందేళ్లు పూర్తి చేసుకుంటున్న గండిపేట చెరువును ఎకో టూరిజం స్పాట్‌గా మార్చేందుకు రూ.100 కోట్ల నిధులకు ప్రభుత్వం నుంచి పరిపాలన అనుమతులు రావడంతో ఆ అభివృద్ధి పనులపై దృష్టి సారించింది.
♦ ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో బాటాసింగారం, మంగల్‌పల్లిలో లాజిస్టిక్ హబ్ (వస్తు నిల్వకేంద్రాలు) పనులు పూరై్త అందుబాటులోకి వచ్చాయి.
♦ హరితహరంలో భాగంగా కోట్ల మొక్కలు సిద్ధం చేసి పచ్చదనం కోసం పాటుపడుతోంది.
♦ బాలానగర్ నర్సాపూర్ ఎక్స్ రోడ్డులో ట్రాఫిక్ కష్టాలు తీర్చడానికి హెచ్‌ఎండీఏ రూ.384 కోట్లతో బాలానగర్‌లోని శోభన థియేటర్ నుంచి ఐడీపీఎల్ వరకు 1.09 కిలోమీటర్ల పొడవునా ఆరు లేన్ల ఫ్లైఓవర్ నిర్మాణ పనులు మొదలెట్టింది.
♦ శివారులో అనధికారిక లే అవుట్‌లకు క్రమబద్దీకరించుకునేందుకు ఇచ్చిన లే అవుట్ రెగ్యులేషన్ స్కీమ్ (ఎల్‌ఆర్‌ఎస్) ద్వారా హెచ్‌ఎండీఏకు వచ్చిన రూ.1100 కోట్ల ఆదాయాన్ని ప్రజల మౌలిక వసతులకు ఖర్చుబెడుతున్నారు.
♦ సంగారెడ్డి మున్సిపాలిటీలో రూ.10 కోట్లు, పటాన్‌చెరులో రూ.మూడు కోట్లతో రహదారుల విస్తరణ, డ్రైనేజీ, సీవరేజీ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల వసతుల పనులు పూర్తి చేశారు.
♦ సంగారెడ్డి పట్టణంలో రూ.6.59 కోట్లతో రెండు కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరణ పనులు, డ్రై నేజీ ఏర్పాటు, ఫుట్‌పాత్‌ల ఏర్పాటు చేశారు.
♦ రంగారెడ్డి జిల్లాలో తొర్రూరులోని ఇంజాపూర్ ఎక్స్ రోడ్డు నుంచి వై జంక్షన్ వరకు బీటీ రోడ్డు విస్తరణ పనుల కోసం రూ.రెండు కోట్ల 95 లక్షలను మంజూరు చేసింది. రూ.ఐదు కోట్లతో పటాన్‌చెరులో ట్రక్కు పార్కింగ్ పనులు పూర్తయ్యాయి.
పారిశ్రామిక కేంద్రంగా మేడ్చల్
సాక్షి,మేడ్చల్ జిల్లా: కొత్తగా ఏర్పడిన మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది. మేడ్చల్ జిల్లాగా ఏర్పడిన తర్వాతనే 11,750 కొత్త పరిశ్రమలు ఏర్పడ్డాయి. ఈ పరిశ్రమల్లో రూ.15091.84 కోట్ల పెట్టుబడులను పారిశ్రామిక వేత్తలు పెట్టగా 2,29,673 మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. అలాగే మరో 783 భారీ, సూక్ష్య, మధ్యతరహా పరిశ్రమలను రూ.12,523 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలుస్తున్నది.
Comments
Please login to add a commentAdd a comment