
వేల్పూర్ : అదనపు కట్నం కావాలని వరుడు పెళ్లికి నిరాకరించిన ఘటన నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పచ్చల నడ్కుడలో జరిగింది. బుధవారం జరగాల్సిన పెళ్లి ఆగిపోవడం తో వధువు ఇంట్లో తీవ్ర విచారం నెలకొంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పచ్చలనడ్కుడ గ్రామానికి చెందిన జుంబరాతి కిషన్, లక్ష్మీ దంపతుల కుమార్తె మానసకు, బా ల్కొండ మండలం వన్నెల్ బి గ్రామానికి చెంది న అల్గోట్ రాజేందర్, మమత దంపతులు ఏకైక కుమారుడు రాజ్‌కుమార్‌తో పెళ్లి కుదిరింది. వీరిద్దరికి ఈనెల 16న నిశ్చితార్థం కూడా జరిపారు. పెళ్లికి వరకట్నంగా రూ. 6.50 లక్షలు, ఇతర సామగ్రి, ఫర్నిచర్ ఇచ్చేందుకు వధువు తల్లిదండ్రులు ఒప్పందం కుదుర్చుకున్నారు.
అడ్వాన్సుగా రూ. 3 లక్షలు ఇచ్చినట్లు తెలిపారు. పెళ్లిరోజున మిగతా మూడున్నర లక్షల కట్నం ఇవ్వాల్సి ఉంది. శుభలేఖలు తయారు చేయించుకొని, రెండు కుటుంబాలు వాటిని మార్చుకున్నారు. పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అంతలో మంగళవారం వరుడు రాజ్‌కుమార్ వధువు ఇంటి వారికి ఫోన్‌చేసి, తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని, రూ. 20 లక్షల కట్నం ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని చెప్పినట్లు తెలిపారు. ఇదేమని వరుడు తరపు వారిని అడిగితే మాకు రూ. 30 లక్షల కట్నం ఇచ్చేవారు ఉన్నారని, మీరు రూ.20 లక్షల కట్నం ఇస్తేనే పెళ్లికి ఒప్పుకుంటామని చెబుతున్నారని పేర్కొన్నారు. తాను ఆటో నడుపుకొని కుటుంబాన్ని పోషించుకుంటానని, అంతకట్నం ఎలా ఇస్తానని వధువు తండ్రి కిషన్ వాపోయాడు. అంత కట్నం కోరేవారు తన కూతురుతో ఎందుకు వివాహానికి ఒప్పుకున్నారని ప్రశ్నించాడు.
Comments
Please login to add a commentAdd a comment