‘గ్యాస్’ కాలపరిమితి.. గుర్తించేదెలా?
మనం వాడే ప్రతి వస్తువుకూ కాలపరిమితి ఉంటుంది. అది తినే వస్తువు కావొచ్చు.. ఆరోగ్యాన్ని కాపాడే మందులు కావొచ్చు.. ఇంట్లో ఉపయోగించే వస్తువు కావొచ్చు. మనం నిత్యం ఇంట్లో ఉపయోగించే గ్యాస్ సిలిండర్‌కు కూడా కాలపరిమితి ఉంటుంది. అన్ని వస్తువులపై పలానా సంవత్సరం.. పలానా నెలలో డేట్ అయిపోతుందని ముద్రించి ఉంటుంది. గ్యాస్ సిలిండర్‌పై మాత్రం ఒక ‘కోడ్’ రూపంలో దాని కాలపరిమితి ముద్రించి ఉంటుంది. మరి ఆ కోడ్‌ను ఎలా గుర్తించాలి..? ఏ నెలలో దాని కాలపరిమితి ముగుస్తుంది..? తదితర విషయాలు మీకోసం.. - సాక్షి, రంగారెడ్డి జిల్లా
* ప్రతి సిలిండర్‌పై ప్రత్యేక ‘కోడ్’
* దానిని బట్టే కాలపరిమితి గుర్తింపు
* వినియోగంలో జాగ్రత్త సుమా!
ప్రయోజనం..
⇒ గ్యాస్ సిలిండర్ కాలపరిమితి ‘ఆల్ఫా న్యూమరికల్’ పద్ధతిలో ముద్రితమై ఉంటుంది.
⇒ సిలిండర్ హ్యాండిల్ రాడ్ వద్ద ఏదో ఒకదానిపై ఒక ఇంగ్లిష్ అక్షరం, రెండు సంఖ్యలు ముద్రించి ఉంటాయి.
⇒ ఇంగ్లిష్ అక్షరం సిలిండర్ కాల పరిమితిలో నెలను.. పక్కనున్న సంఖ్య సంవత్సరాన్ని సూచిస్తుంది.
ఉదా: సిలిండర్‌పై ‘డి 16’ అని ఉందనుకుంటే.. ‘డిసెంబరు- 2016’ సంవత్సరానికి దాని కాలపరిమితి ముగుస్తుందని అర్థం.
⇒ ఇక్కడ నెలను ముద్రించే విధానం భిన్నంగా ఉంటుంది. దీన్ని నాలుగు రకాలుగా విభజించారు.
⇒ సంవత్సరంలోని 12 నెలలను ‘ఎ,బి,సి,డి’గా విభజించారు. వీటిలో ఒక్కోదానికి మూడు నెలలుగా కేటాయించారు.
⇒ అంటే ‘ఎ’ సిరీస్‌కు మెదటి భాగం మూడు నెలలు (జనవరి, ఫిబ్రవరి, మార్చి), ‘బి’ సిరీస్‌కు రెండో భాగం మూడు నెలలు (ఏప్రిల్, మే, జూన్), ‘సి’ సిరీస్‌కు (జూలై, ఆగస్టు, సెప్టెంబరు), ‘డి’ సిరీస్‌కు నాలుగో భాగం మూడు నెలలు (అక్టోబరు, నవంబరు, డిసెంబరు)గా ఉన్నాయి.
⇒ సిలిండర్‌పై ‘ఎ’ ఉంటే మార్చి వరుకు, ‘బి’ ఉంటే జూన్ వరకు, ‘సి’ ఉంటే సెప్టెంబరు వరకు, ‘డి’ ఉంటే డిసెంబరు వరకు అని అర్థం.
ఉదా: ‘ఎ 20’ అని ఉంటే.. ‘మార్చి 2020’ నాటికి సిలిండర్ గడువు ముగుస్తుంది.
సూచన: కాలపరిమితి అయిన సిలిండర్‌ను గుర్తించి అప్పుడే మార్చుకోవాలి. లేకపోతే దాన్ని వాడే సమయంలో ఒత్తిడికి గురైనా, దాన్ని అలాగే వాడినా ప్రమాదం సంభవించే అవకాశం ఉంది.