సాక్షి, హైదరాబాద్: పోలీసుల జీవితాల్లో భాగమైన ‘ఫిట్‌నెస్’అంశం ఐపీఎస్ అధి కారుల పదోన్నతులకు ఎసరుపెడుతోంది. ‘స్మార్ట్ పోలీసింగ్’చేయాలంటే ఐపీఎస్ అధికారులు శారీరకంగా కూడా దృఢంగా ఉండాలని, అలా ఫిట్‌గా ఉన్నవారికే పదోన్నతులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పదోన్నతుల సమయంలో ఐపీఎస్ అధికారులకు ఫిట్‌నెస్ పరీక్ష తప్పనిసరి చేయాలని, ఈ ప్రతిపాదనలపై అభిప్రాయాలు తెలియజేయాలంటూ రాష్ట్రాలకు లేఖలు రాసింది. అంతేగా కుండా ఉత్తమ సేవలు అందించినవారికి ఇచ్చే పోలీస్ మెడల్ పొందాలన్నా కూడా ఫిట్‌నెస్ పరీక్ష తప్పనిసరి చేయాలని కూడా ఆ లేఖలో పేర్కొంది.
స్పందించింది మూడు రాష్ట్రాలే..
కేంద్రం రెండు నెలల కిందే ఈ ప్రతిపాదన చేసినా ఇప్పటివరకు మూడు రాష్ట్రాలు మాత్రమే అభిప్రాయం వ్యక్తం చేశాయి. ఇందులో మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాలు కేంద్ర ప్రతిపాదనను వ్యతిరేకించగా.. తెలంగాణ మాత్రం మిశ్రమ అభిప్రాయం వ్యక్తం చేశాయి. మహారాష్ట్ర ఆసక్తికరంగా సమాధానమిచ్చినట్టు కేంద్ర హోంశాఖ (ఎంహెచ్‌ఏ) వర్గాలు చెబుతున్నాయి. ఐపీఎస్ అధికారులు రోజంతా పనిచేయాల్సి ఉంటుందని, వారికి తమ శరీరాకృతి, ఫిట్‌నెస్ కోసం చెమటోడ్చే సమయం ఉండదని పేర్కొన్నట్లు తెలిసింది. ఇక తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రతిపాదనను వ్యతిరేకించలేదు, ఆమోదయోగ్యమని అంగీకరించలేదు. కేవలం కేంద్ర ప్రతిపాదనల పట్ల సానుకూలంగా ఉన్నామని, వాటిని అమలు చేయాలంటూ సంబంధిత విభాగాలకు ఆదేశాలిస్తామని పేర్కొంది.
ఐపీఎస్‌లలో వ్యతిరేకత!
‘ఫిట్‌నెస్’ప్రతిపాదనలపై దేశవ్యాప్తంగా ఐపీఎస్ అధికారులు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. దీనిపై రాష్ట్ర ఐపీఎస్ అధికారి ఒకరు స్పందిస్తూ.. ‘‘పోలీసులు అంటే అందరికీ చులకనే! శ్రమకు తగిన గౌరవం, ప్రతిఫలం లేని ఉద్యోగంలో ఉన్నప్పుడు ఇలాంటివన్నీ ఎదుర్కోవాల్సిందే..!’’అని వ్యాఖ్యానించారు. ఏ ఆలిండియా సర్వీసు అధికారులకు లేని నిబంధన తమకు ఎందుకని ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్న మరో ఐపీఎస్ అధికారి పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనలు సరికాదని.. మానసికంగా దృఢంగా ఉండి, ఎలాంటి శారీరక రుగ్మతలతో బాధపడకుండా ఉంటే చాలని రాష్ట్ర ఐపీఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి.
అమలుకు కేంద్రం యోచన!
ఐపీఎస్ అధికారులకు ఫిట్‌నెస్ అంశంపై కేంద్ర హోంశాఖ వెనక్కి తగ్గే అవకాశాల్లేవని సమాచారం. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అభిప్రాయం తెలుసుకున్న తర్వాత.. ఐపీఎస్‌ల పదోన్నతులకు మార్గదర్శకాలు రూపొందించాలని కేంద్రం భావిస్తోంది. సీఆర్పీఎఫ్, బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఈ తదితర పారామిలటరీ అధికారులకు వర్తింపజేసే శారీరక దృఢత్వ నిబంధనలను వర్తింపజేయాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే.. శారీరకంగా దృఢంగా లేని ఐపీఎస్ అధికారుల మెడికల్ బిల్లులు భారంగా మారాయని కేంద్రం భావిస్తోందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సీజీహెచ్‌ఎస్) కింద ఆ మెడికల్ బిల్లులు క్లియర్ అవుతున్నందున ఆ కోణంలోనూ ‘ఫిట్‌నెస్’ప్రతిపాదనను పెట్టిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు ఈ అంశంపై ఇప్పటివరకు మూడు రాష్ట్రాలే అభిప్రాయం తెలపడం పట్ల కేంద్ర హోంశాఖ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఐపీఎస్ అధికారులు ‘ఫిట్‌నెస్’అంశానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వాలను ప్రభావితం చేస్తున్నారని సందేహిస్తున్నట్లు తెలుస్తోంది.
‘ఫిట్‌నెస్’ ఉంటేనే పదోన్నతి!
Published Thu, Jan 25 2018 2:05 AM | Last Updated on Tue, Aug 21 2018 6:02 PM
Comments
Please login to add a commentAdd a comment