
గత పాలకుల వల్లే తాగు, సాగునీటి ఇబ్బందులు
రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి
బాలానగర్ : గత పాలకుల నిర్లక్ష్యం కారణంగానే ఇంతకాలం తెలంగాణలో సాగు, తాగునీటికిఇబ్బందులు పడ్డారని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. గత పాలకుల అరవై ఏళ్ల పాపాలను ఐదేళ్లలో కడిగేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం కంకణం కట్టుకున్నదని ఆయన చెప్పారు. శుక్రవారం మోతిఘనాపూర్‌లో నిర్మించిన గ్రామ సచివాలయంతోపాటు గంగధర్‌పల్లిలో నిర్మించిన ఓవర్‌హెడ్ ట్యాంకును, అమ్మపల్లిలో అంగన్‌వాడీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా గంగధర్‌పల్లిలో పర్యటించి అక్కడి సమస్యలు తెలుసుకున్నారు. గ్రామంలో మురుగు కాల్వలు, సీసీ రోడ్లు లేవని మహిళలు మంత్రికి విన్నవించుకున్నారు.
దానికి స్పందించిన మంత్రి సీసీ రోడ్లు, మురుగుకాల్వల నిర్మాణానికి వెంటనే రూ. 5 లక్షల నిధులను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. పనులు తొందరగా ప్రారంభించాలని అధికారులకు సూచించారు. అనంతరం మోతిఘనాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రిని గ్రామస్తులు సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బంగారు తెలంగాణ కోసం పార్టీలకు అతీతంగా తోడ్పాటునందించాలన్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారని, అది పూర్తయితే లక్షా యాభై వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.