'జాత్యంహకార దాడులు మంచిది కాదు'
Published Sun, Mar 5 2017 6:42 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM
హైదరాబాద్: అమెరికాలో వరుసగా జరుగుతున్న భారతీయుల హత్యల్ని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తీవ్రంగా ఖండించారు. కూచిబొట్ల శ్రీనివాస్ హత్య ఉదంతాన్ని మరువకముందే గుజరాత్‌కు చెందిన పటేల్ హత్య జరగడంపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఈ తరహా జాత్యహంకార దాడులు ఆ దేశానికి మంచిది కాదని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అదేవిధంగా వాషింగ్టన్‌లో నివసిస్తున్న దీప్‌రాయ్ అనే భారతీయుడిపైనా దాడి జరగడంతో అక్కడ నివసిస్తున్న భారతీయులు ఆందోళన చెందుతున్నారని, ఈ విషయంలో అమెరికా ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు.
కేంద్ర ప్రభుత్వం తరపున విదేశాంగ శాఖ కార్యదర్శి ఎస్.జయశంకర్ ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తూ దౌత్యపరమైన చర్చలు సాగిస్తున్నారు. భారతీయుల భద్రత కోసం అమెరికా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నట్లు చెప్పారు. ఇకపై ఇలాంటి జాత్యహంకార దాడులు జరగకుండా అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని బండారు దత్తాత్రేయ డిమాండ్ చేశారు.
Advertisement
Advertisement