పింఛన్ లబ్ధిదారులు (ఫైల్)
సాక్షి, హుజూరాబాద్: చెల్పూర్ గ్రామానికి చెందిన మల్లమ్మ ఒక్కరే కాదు కరీంనగర్ జిల్లాలోని ఐదు వేలకు పైగా మంది మహిళలు అభయహస్తం పథకంలో అందే పింఛన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆసరా పథకాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఆయా గ్రామాల్లోని వృద్ధులు, వితంతువులకు నెలకు రూ.2016 చొప్పున పింఛన్ అంది స్తోంది. వికలాంగులకు రూ.3016 పింఛన్ అందిస్తున్నారు. అభయహస్తం పథకంలో లబ్ధిదారులుగా ఉంటూ నెలకు రూ.500 పింఛన్ పొందేవారిని ప్రభుత్వం విస్మరించడంపై ఆందోళన చెందుతున్నారు. మహిళా సంఘాల సభ్యులకు బీమా, వృద్ధాప్యంలో పింఛన్ సౌకర్యం కల్పించేందుకు అభయహస్తం పథకాన్ని ప్రవేశపెట్టారు. 65 ఏళ్లు నిండిన మహిళా సంఘంలోని సభ్యులకు నెలకు రూ.500 చెల్లించేవారు. అభయహస్తం పింఛన్‌ను 2017 ఫిబ్రవరి నుంచి ప్రభుత్వం నిలిపివేయగా, రెండేళ్ల నుంచి జిల్లాలో 5150 మంది లబ్ధిదారులు పింఛన్ సొమ్ము కోసం ఎదురుచూస్తున్నారు. కుటుంబ సమగ్ర సర్వే సమయంలో కుటుంబంలో వివిధ రకాలుగా పింఛన్ పొందుతున్న వారి వివరాలను అధికారులు ఇంటింటికి వెళ్లి నమోదు చేసుకున్నారు. ఆయా గ్రామాల్లో అభయహస్తం ద్వారా పింఛన్ వస్తుందన్న విషయాన్ని తెలుసుకొని మరోమారు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని లబ్ధిదారులకు చెప్పుకొచ్చారు. ఆ తర్వాత తమకు మొండి చేయి చూపారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులకు అందని మార్గదర్శకాలు
అభయహస్తం పథకం అమలుపై ప్రభుత్వం నుంచి ఇంకా అధికారులకు మార్గదర్శకాలు అం దలేదని తెలుస్తోంది. ఆసరా పథకంలో గతంలో నే 65 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పింఛన్ అం దజేయగా, అభయహస్తంలో పింఛన్ నిలిచిన వారు ఆసరా పథకంలో దరఖాస్తు చేసుకోవా లని సూచించగా, కొంతమంది పొందుతున్నా రు. ఒకే ఇంట్లో వృద్ధాప్య పింఛన్ ఇద్దరికి ఇచ్చే అవకాశం లేకపోవడంతో చాలామంది అభయహస్తం పింఛన్ లబ్ధిదారులు ఆసరా పింఛన్ అందుకోలేకపోతున్నారు. 65 ఏళ్లు నిండిన వారికి అందుతున్న వృద్ధాప్య పింఛన్ ఇక నుంచి 57 ఏళ్లు నిండిన వారందరికీ ఇస్తామని ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఎన్నికల హామీలో భాగంగా 57 ఏళ్ల పింఛన్ పథకాన్ని అమల్లోకి తెస్తున్నట్లుగా కూడా ఇటీవలనే ప్రకటించారు. ప్రభుత్వ ప్రకటనతో అర్హులైన వారు దరఖాస్తులు చేసుకున్నారు. గతంలో రూ.1000 ఉన్న పింఛన్ తాజాగా రూ.2 వేలకు పెంచారు. 57 ఏళ్ల పింఛన్ హామీ అమలుకు కూడా మార్గదర్శకాలు రాకపోవడంతో ప్రస్తుతం పాత వారే కొత్త పింఛన్ తీసుకుంటున్నారు. జిల్లాలో సుమారుగా 14 వేల మంది 57 ఏళ్లు నిండిన వారు పింఛన్ కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం. కొంతమంది ఆసరా పథకంలో పింఛన్ పొందడానికి అర్హత ఉన్న అభయహస్తం పింఛన్ లబ్ధిదారులు ఆసరా పథకంలో పింఛన్ తీసుకుంటున్నారు. చాలామందికి అర్హత లేకపోవడంతో అభయహస్తం పింఛన్ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం అభయహస్తం లబ్ధిదారులకు కూడా ఆసరా పథకంలో లబ్ధి చేకూరే విధంగా ఆలోచన చేయాలని పలువురు కోరుతున్నారు.
జిల్లాలో అభయహస్తం లబ్ధిదారుల వివరాలు
హుజూరాబాద్ మండలంలో 535 మంది, వీణ వంకలో 512, జమ్మికుంటలో 254, ఇల్లందకుంటలో 176, సైదాపూర్‌లో 296, శంకరపట్నంలో 480, చిగురుమామిడిలో 358, చొప్పదండిలో 365, గంగాధరలో 362, గన్నేరువరంలో 164, కరీంనగర్‌రూరల్‌లో 289, కరీంనగర్(మున్సిపాలిటీ)లో 24, కొత్తపల్లిలో 215, మానకొండూర్‌లో 350, రామడుగులో 473, తిమ్మాపూర్‌లో 297 మంది ఉన్నారు.
ప్రభుత్వ పరిశీలనలో ఉంది
అభయహస్తం పథకం అమలు విషయం ప్రభుత్వం పరిశీలనలో ఉంది. ఆసరా పథకం ప్రారంభమైన నేపథ్యంలో 2017 నుంచి అభయహస్తం పథకం నిలిచింది. ఆసరా పథకంలోనే ప్రస్తుతం 65 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పింఛన్ ఇస్తున్న నేపథ్యంలో అర్హులైన వారు ఆసరా పథకంలో దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి పింఛన్ మంజూరుకు ప్రతిపాదించడం జరుగుతుంది. అభయహస్తం ప£థకం విషయాన్ని ఇప్పటికే రాష్ట్రస్థాయి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం.
– వెంకటేశ్వర్‌రావు, డీఆర్‌డీఏ పీడీ
‘‘మూడేళ్లుగా అభయహస్తం పింఛన్ రావడం లేదు. మహిళా సంఘంలో సభ్యురాలైన నాకు గతంలో అభయహస్తం పథకంలో నెలకు రూ.500 వచ్చేవి. మూడేళ్ల సంది రావడం లేదు. పింఛన్ పైసలు వత్తలేవని ఊళ్లకు వచ్చే సార్లకు చాన సార్ల చెప్పిన ఆసరా పథకంలోనన్న పింఛన్ వచ్చేలా చూడాలె.’’
– ఇదీ హుజూరాబాద్ మండలం చెల్పూర్ గ్రామానికి చెందిన మల్లమ్మ ఆవేదన
Comments
Please login to add a commentAdd a comment