నేటి నుంచి కేసీఆర్ కిట్ పథకం
► నేడు పేట్లబురుజు ఆసుపత్రిలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం
►ఆడబిడ్డ పుడితే రూ.13 వేలు, మగబిడ్డకు రూ.12 వేల సాయం
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ పేరిట ప్రవేశపెడుతున్న ‘కేసీఆర్ కిట్’పథకం శనివారం ప్రారంభం కానుంది. హైదరాబాద్‌లోని పేట్ల బురుజు ఆసుపత్రిలో కేసీఆర్ చేతుల మీదుగా బాలింతలు, శిశువులకు కిట్ అందజేస్తారు. రెండు కాన్పులకు ఈ పథకం వర్తిస్తుంది. ఇక ఒక్కో కాన్పునకు రూ.2 వేల విలువైన కేసీఆర్ కిట్ అందజేస్తారు. ఆడబిడ్డ పుడితే రూ.13 వేలు, మగబిడ్డ పుడితే బాలింతలకు రూ.12 వేలు అందిస్తారు. తల్లీ బిడ్డల ఆరోగ్యాన్ని సంరక్షించడం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు చేయడం, అనవసర సిజేరియన్లు తగ్గించడం కోసం ప్రభుత్వం ఈ పథకాన్ని తీర్చిదిద్దింది.
రాష్ట్రంలోని 9 బోధన, ఆరు జిల్లా ఆసుపత్రులు, మూడు మాతా శిశు సంరక్షణ కేంద్రాలు, 30 ఏరియా ఆసుపత్రులు, 114 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 24 గంటలపాటు నడిచే 314 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, మరో 365 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మొత్తం 841 ఆసుపత్రుల్లో ‘కేసీఆర్ కిట్’ను అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. తెలంగాణలో 6.28 లక్షల ప్రసవాలు జరుగుతున్నాయని, వీటిల్లో 30 నుంచి 40 శాతం వరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవుతున్నాయి. కనీసం 50 శాతం ప్రసవాలు ప్రభుత్వ ఆసుత్రుల్లోనే జరిగేలా చూడాలని ప్రభుత్వం భావిస్తుంది.
ఆర్థికసాయం ఇలా...
గుర్తించిన గర్భిణులకు పరీక్షలు జరుగుతున్న సమయంలో మాతా శిశు సంరక్షణ కార్డు పొంది, కనీసం రెండుసార్లు పరీక్షలు చేయించుకున్న తర్వాత రూ.3 వేలను పౌష్టికాహారం కోసం అందచేస్తారు. మగబిడ్డ పుడితే మరో రూ.4 వేలు, ఆడబిడ్డ అయితే మరో రూ.వెయ్యి కలిపి ఇస్తారు. అప్పుడే కేసీఆర్ కిట్ ఇస్తారు. బిడ్డ పుట్టినప్పటి నుండి 3 నెలల కాలంలో టీకాలు తీసుకున్న తర్వాత రూ.2 వేలు ఇస్తారు.
బిడ్డ పుట్టినప్పటి నుండి 9 నెలల కాలంలో ఇవ్వాల్సిన టీకాలన్నీ తీసుకున్న తర్వాత మరో రూ.3 వేలు అందచేస్తారు. ఇలా ఒక్కో తల్లీబిడ్డకు నాలుగు విడతలుగా రూ.12 వేలు, ఆడబిడ్డ కలిగితే మరో వెయ్యి అదనంతో రూ.13 వేలు అందుతాయి. సర్కార్ దవాఖానాల్లో ప్రసవం చేయించుకున్న వాళ్లకే ఈ పథకం వర్తిస్తుంది. ఇదిలావుండగా గర్భిణీ ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ, బ్యాంకు ఖాతా, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్, మొబైల్ ఫోన్ నంబర్, మతా శిశు సంరక్షణ కార్డుల ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ఆ తర్వాత నిర్ణీత సమయాల్లో వారి ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులు జమా చేస్తుంది.