సాక్షి, వరంగల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టులపై అవాస్తవాలతో ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. ఆదివారం హన్మకొండలోని హరిత హోటల్‌లో ఎమ్మెల్యేలు సీతక్క, శ్రీధర్ బాబు, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యలతో కలిసి ఆయన ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. కాళేశ్వరం జలకళ అంతా అబద్ధమనీ, సీఎం చెప్తున్నట్టు మిడ్‌మానేరుకు కాళేశ్వరం నుంచి చుక్కనీరు రాలేదని ఆయన తెలిపారు. కాంగ్రెస్ హయాంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సారథ్యంలో నిర్మించిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచే మిడ్‌మానేరుకు నీళ్లు వచ్చాయని వివరించారు. అప్పుడే ఎల్లంపల్లి ప్రాజెక్టులో 5 మోటార్లను బిగించి 7, 8 పంపు సెట్లు నిర్మించామని తెలిపారు. కాంగ్రెస్ నిర్మించిన ప్రాజెక్టులతో టీఆర్‌ఎస్ సంబరాలు చేసుకుంటోందని ఎద్దేవా చేశారు. మేడిగడ్డ నుంచి అన్నారంకు 12 టీఎంసీలు, అన్నారం నుంచి సుందిళ్లకు 6 టీఎంసీలు తెచ్చామంటున్న కేసీఆర్, ఆ నీళ్లన్నీ తిరిగి గోదావరిలో కలిసి కిందికి వెళ్లిపోయాయని ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. జలహారతి పేరుతో పాలాభిషేకాలు చేసుకోవడం సిగ్గుచేటని తీవ్రంగా మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment