బొమ్మలరామారం : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఫొటోలకు ఫోజులివ్వడం, ప్రచార ఆర్భాటమే తప్ప తన ఏడాది పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్ విమర్శించారు. టీఆర్‌ఎస్ పాలనపై అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని పేర్కొన్నారు. బొమ్మలరామారంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు ఏకకాలంలో రుణమాఫీ అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైనదన్నారు. రుణమాఫీకాక, కొత్తగా బ్యాం కు రుణాలు అందక రైతాంగం సంక్షోభంలో కూరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలోనే రైతులకు మేలు జరిగిందని, రైతు సంక్షేమాన్ని విస్మరిస్తున్న కేసీఆర్‌కు వారి ఉసురు తగులుతుందన్నారు.
కమీషన్లకు కక్కుర్తి పడి ప్రాణహిత డిజైన్ మార్పు చేస్తున్నారని, అలాగే మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్‌లకు కేటాయిస్తున్న నిధుల్లో రూ.30వేల కోట్లు కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తన కుటుంబాన్ని ధనవంతంగా చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని మాత్రం పేదరికంలో ఉంచుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ వైఖరికి నిరసనగా అఖిలపక్షాల ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి మోకు మదుసూదన్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు సింగిర్తి మల్లేషం, తిరుమల భాస్కర్‌గౌడ్, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు చీర సత్యనారయణ, నాయకులు నర్సింహారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, మోటే గట్టయ్య, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ ప్రజలకు చేసిందేమీ లేదు
Published Fri, Jul 24 2015 10:41 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement