కల్లు డిపోలు తెరిపిస్తాం
లిక్కర్ లాబీతో కుమ్మక్కై సీమాంధ్ర ప్రభుత్వాలు వాటిని మూసేశాయి: కేసీఆర్
టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, బాలకిషన్
సాక్షి, హైదరాబాద్: తాము అధికారంలోకి వచ్చిన వెంటనే హైదరాబాద్‌లో మూతపడిన కల్లు డిపోలను తిరిగి తెరిపిస్తామని టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. లిక్కర్ లాబీతో కుమ్మక్కైన సీమాంధ్ర ప్రభుత్వాలు హైదరాబాద్‌లోని కల్లు డిపోలను మూసివేయించాయని ఆరోపించారు. ఆదివారం కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, టీజీవోల సంఘం అధ్యక్షుడు వి.శ్రీనివాస్‌గౌడ్, తెలంగాణ ధూంధాం కన్వీనర్ రసమయి బాలకిషన్ టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలకు, పాల మూరులో వలసలకు, నల్లగొండలో ఫ్లోరైడ్ బాధలకు, ఆదిలాబాద్‌లో అంటు రోగాలకు, దుబాయి వలసలకు కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలే కారణమని కేసీఆర్ మండిపడ్డారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో నదులు, నీళ్లు ఉన్నా.. కల్వకుర్తి, నెట్టెంపాడులను ఎందుకు పూర్తిచేయలేకపోయారని ప్రశ్నించారు. మహబూబ్‌నగర్ నుండి ఇప్పటిదాకా మంత్రులు, సామంతులు లేరా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ వంటి స్వీయ రాజకీయ అస్తిత్వం ఉన్న పార్టీలు ఉండాలని... కాంగ్రెస్‌లో విలీనం చేస్తే మొదటికే మోసమని అనేకమంది హెచ్చరించారని కేసీఆర్ చెప్పారు. అందుకే విలీనం చేయలేదని, పొత్తులు కూడా ఉండవని ఇప్పటికే ప్రకటించానని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు ఆశించిన బంగారు తెలంగాణ టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమన్నారు. తెలంగాణ పోరాటంలో అగ్రభాగాన నిలిచిన ఉద్యమకారులు ఎన్నికల్లో అభ్యర్థులుగా ఉంటారని, వారిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మందా జగన్నాథం, పార్టీ నేతలు నిరంజన్‌రెడ్డి, సి.లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.
కేసీఆర్‌ను కలిసిన జలగం వెంకట్రావు
టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నేత జలగం వెంకట్రావు ఆదివారం సమావేశమయ్యారు. ఖమ్మం లోక్‌సభ లేదా కొత్తగూడెం అసెంబ్లీ స్థానం నుండి పోటీకి దిగాలని జలగం ఆసక్తి కనబరుస్తున్నారు. కాగా.. పటాన్‌చెరు ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ టీఆర్‌ఎస్‌లో సోమవారం చేరనున్నారు.