‘ప్రజాభీష్టం మేరకే పాలకులు నడుచుకోవాలి’
షాద్‌నగర్: ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజల అభీష్టం మేరకు పాలకులు నడుచుకోవాలని తెలంగాణ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ఫరూఖ్‌నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామాన్ని మండలంగా ప్రకటించాలంటూ గ్రామస్తులు చేపట్టిన రిలే దీక్షలు 18వ రోజుకు చేరాయి. ఈ దీక్షకు సంఘీభావం కోదండరామ్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలు, మండలాల విభజన శాస్త్రీయ పద్ధ్దతిలో జరగాలన్నారు. ఆయా ప్రాంతాల పరిస్థితులు, ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే విభజన చేయాలన్నారు. లేని పక్షంలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందన్నారు. ఫరూఖ్‌నగర్ మండలాన్ని రెండుగా చేయడానికి అన్ని అర్హతలు ఉన్నాయన్నారు.
ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ ఏ ప్రమాణాలు పాటించి మండలాలను ఏర్పాటు చేశారో ముఖ్యమంత్రి వెల్లడించాలని కోరారు. మొగిలిగిద్దను మండలంగా ప్రకటించకపోవడానికి గల కారణాలను కూడా ప్రజలకు తెలియచేయాల్సిన బాధ్యత ఉందన్నారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చకు పిలిస్తే తాను వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానన్నారు.