నల్లగొండ : నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం అనిశెట్టి దుప్పలపల్లి గ్రామం సమీపంలో ఆగి ఉన్న బస్సును లారీ ఢీ కొనడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన నార్కెట్‌పల్లి-అద్దంకి జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున జరిగింది. మిర్యాలగూడ డిపోకు చెందిన బస్సు నల్లగొండ వెళ్తుండగా మార్గమధ్యలో అనిశెట్టి దుప్పలపల్లి గ్రామం సమీపంలో ఆగింది. అదే సమయంలో నల్లగొండ వైపు వస్తున్న లారీ ఆగి ఉన్న బస్సును వెనుక నుంచి ఢీ కొట్టింది. దీంతో బస్సులో వెనుక వైపు కూర్చున్న ముగ్గురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. గాయాలైన వారిని 108లో నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించి వైద్యసేవలు అందిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.