విద్యుత్‌దీపాలతో ముస్తాబైన కాళేశ్వరాలయం
శివరాత్రికి విద్యుదీపాలంకరణలో ముస్తాబు
కాళేశ్వరం: జయశంకర్‌భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరాలయంలో ఈ నెల 20 నుంచి 22 వరకు జరిగే మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని కాళేశ్వరాలయం విద్యుత్‌దీపాలతో జిగేల్‌మంటోంది. మంగళవారం రాత్రి ఆలయంలోని ప్రధాన గర్భగుడిని విద్యుత్ దీపాలతో అలంకరించారు. రంగు రంగుల విద్యుత్ దీపాలతో కాళేశ్వరాలయం ముస్తాబు కావడంతో శివరాత్రి శోభను సంతరించుకుంది.
శివకేశవుల నిలయం పాలకుర్తి పుణ్యక్షేత్రం
జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో(క్షీరగిరి)పై వెలసిన శ్రీ సోమేశ్వర లక్ష్మీ నర్సింహస్వామి లింగము స్వయంభువు. ఆలయ గుహల నుంచి∙ఓంకార ప్రణవనాదం వినిపిస్తుందని భక్తుల విశ్వాసం. అదృశ్య రూపంలో ఉన్న సిద్ద పురుషులు అర్ధ రాత్రి వేళల్లో స్వామి వారిని అర్చించడానికి వస్తారని ప్రతీతి. ఈ క్షేత్రాన్ని సందర్శించిన వారికి లక్ష రెట్లు అధిక ఫలితంతో పాటు మోక్షం లభిస్తుందని నమ్మిక. పక్కనే మరొక గుహలో శ్రీ లక్ష్మీనర్సింహ స్వామి వెలసి శివ కేశవులకు భేదం లేదని ప్రభోదిస్తున్నాడు. ఈ శివ పంచాయతన క్షేత్రంలో శివుడు శ్రీ సోమేశ్వరుడిగా, విష్ణువు లక్ష్మీనర్సింహుడిగా వేర్వేరు గుహల్లో స్వయంభువులుగా వెలసి ఉన్నారు.
పూర్వ కాలంలో సూర్యభగవానుని ఆల యం ఉండగా.. ఇప్పుడు కూడా ఆనవాళ్లు కనిపిస్తాయి. స్వామిపై విశ్వాసం సడలినా, కొండకు పరిశుద్దులై రాకపోయినా స్వామి రక్షక భటులైన తేనేటీగలు వెంటపడి కొండను దిగేలా చేస్తాయి. ఇక్కడ శైవాగం, వైదికాగం ప్రకారంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. గిరిజనులు సంప్రదాయ బద్ధంగా నృత్యాలు చేస్తూ కోలాటాలతో ఎడ్ల బండ్లతో ప్రదర్శనగా రావడం జాతర ప్రత్యేకత. గ్రామంలో పంచగుళ్ల వద్ద ఉన్న కోనేరులో స్నానం చేసిన భక్తులు పంచగుళ్లు దర్శించుకుని సోమేశ్వర ఆలయానికి రావడానికి ఏర్పాట్లుచేశారు.
పాలకుర్తి టౌన్: తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ శైవక్షేత్రాల్లో ఒకటైన పాలకుర్తిలోని శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. హరిహరులు స్వయంభువులుగా ఒకే గుట్టపై వెలసిన దివ్య క్షేత్రంగా పాలకుర్తి వెలుగొందుతుంది. ఏటా మహా శివరాత్రి సందర్బంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈనెల 20 నుంచి 24 వరకు జరిగే బ్రహ్మోత్సవాలకు ఇతర జిల్లాల నుంచే కాకుండా పలు రాష్ట్రాల నుండి భక్తులు తరలి రానున్నారు. 21న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామి వారి కల్యాణం నిర్వహించనుండగా.. రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు దంపతులు పాల్గొని పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
భక్తుల కొంగుబంగారం కురవి వీరన్న
కురవి: భక్తుల కల్పతరువుగా, నమ్మిన వారి కొంగు బంగారంగా కురవిలోని వీరభద్రస్వామి విలసిల్లుతున్నాడు. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత ప్రసిద్ధి గాంచిన శైవ పుణ్యక్షేత్రమైన భద్రకాళి సమేత శ్రీవీరభద్రస్వామి ఆలయంలో కల్యాణ బ్రహోత్సవాలు ఈనెల 20న గురువారం అంకురార్పణతో ప్రారంభం కానున్నాయి. ఈనెల 21వ తేదీన(శుక్రవారం) మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని కల్యాణమహోత్సవం కన్నుల పండువగా జరగనుంది. ఈనెల 20వ తేదీ నుంచి మార్చి 6వ తేదీ వరకు శ్రీ స్వామివారి కల్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆలయచరిత్ర...
క్రీ.శ. 850 ప్రాంతంలో వేంగి రాజధానిగా పాలించు చాళుక్యుల సామంతులైన రాష్ట్రకూట రాజు భీమరాజు కురవిని రాజధానిగా చేసుకుని పాలించేవాడు. అప్పుడే వీరభద్రస్వామి ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. అనంతరం కాకతీయ తొలి స్వతంత్ర రాజు ఒకటో బేతరాజు ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేసినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. రెండో బేతరాజు కురవి పక్కనే పెద్ద తటాకం(చెరువు)ను తవ్వించినట్లు చెబుతారు. కాకతీయ రాణి రుద్రమదేవి ఆలయాన్ని సందర్శించి ఏకశిల రాతి స్తంభ దీపాన్ని నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఇప్పటికి ఆ స్తంభం దర్శనమిస్తుంది. రాజగోపురం దాటి లోనికి వెళ్లగానే ఏకశిలపై నందీశ్వరుడు దర్శనమిస్తాడు.
స్వామివారి ప్రాశస్త్యం
సకల క్తిమూర్తివరాల ప్రదాత అయిన వీరభద్రస్వామి పడమటముఖుడై దశహస్తుడై, త్రినేత్రుడై రౌద్రపరాక్రమములతో విలసిల్లుతున్నాడు. భక్తులను ఆదుకునే పరమభోళామూర్తిగా దర్శనమిస్తున్నాడు. క్షుద్రగణాలకు వీరభద్రుడంటే భయం. అందుకే ఆలయానికి వచ్చి స్వామి వారిని దర్శించుకునే భక్తులకు ఆయురారోగ్యాలు, సిరిసంపదలను అందుతాయని భక్తుల నమ్మిక. స్వామివారికి ఎడమవైపు చతుర్భుజములు కలిగి ఉండి శ్రీ భద్రకాళీ అమ్మవారు వెలసి ఉన్నారు. స్వామి వారికి ఇరువైపులా శివుడు(లింగాకారంలో) దర్శనమిస్తాడు. ఆలయానికి దక్షిణ దిశలో భద్రకాళి అమ్మవారు స్వయంశక్తిమూర్తిగా వెలిసి పూజలందుకుంటోంది.
ఉత్సవాల్లో ముఖ్యఘట్టాలు..
జాతర ఉత్సవాల్లో భాగంగా ఈనెల 20న ఉదయం 9గంటలకు పసుపు, కుంకుమలు అర్చకులు ఆలయానికి తీసుకొస్తారు. సాయంత్రం 7గంటలకు అంకురార్పణ, అఖండకలశస్థాపన, ధ్వజారోహనం, రాత్రి 10గంటలకు బసవ ముద్ద కార్యక్రమం ఉంటుంది. 21న మహాశివరాత్రి రోజున స్వామి వారి ఆలయంలో సేవలు, రాత్రి 1.20గంటలకు(తెల్లవారితే శనివారం) స్వామి వారి కల్యాణ మహోత్సవం జరుగుతుంది. ఇక 26వ తేదీన రథోత్సవం, 27వ తేదీన బండ్లు తిరుగుట, మార్చి 5వ తేదీన శ్రీ పార్వతీరామలింగేశ్వరస్వామి కల్యాణం, 6వ తేదిన పదహారు రోజుల పండుగతో ఉత్సవాలు ముగుస్తాయి.
ముమ్మరంగా సాగుతున్న ఏర్పాట్లు
కురవిలోని భద్రకాళీ సమేత శ్రీవీరభద్రస్వామి కల్యాణ మహోత్సవ జాతరకు ఆలయ అధికారులు, వివిధ శాఖల అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. బుధవారం నాటికి ఏర్పాట్లు పూర్తికానున్నాయి. ఆలయ ఆవరణలో చలువ పందిళ్లు ఏర్పాటుచేయగా... స్వామి కల్యాణ మహోత్సవం జరిగే నాగేంద్రస్వామి ఆలయ ఆవరణలో బారికేడ్లను ఆర్‌అండ్‌బీ అధికారులు నిర్మిస్తున్నారు. స్నాన ఘట్టాల వద్ద షవర్లు, తాత్కాలిక మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి కావొస్తున్నాయి. మొత్తంగా జాతర ఏర్పాట్లు 95శాతం పూర్తి అయ్యాయి. ఈ మేరకు ఏర్పాట్లను మహబూబాబాద్ డీఎస్పీ నరేష్‌కుమార్ మంగళవారం పరిశీలించి పలు సూచనలు చేశారు. జాతర పరిసర ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాట్లపై కురవి ఎస్సై జక్కుల శంకర్‌రావుతో చర్చించారు.
మహిమాన్వితుడు.. అగస్తీశ్వర స్వామి
మరిపెడ రూరల్: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం అబ్బాయిపాలెం శివారు కొండపై స్వయంభూగా వెలసిన అగస్తీశ్వర స్వామి మహిమాన్వితుడిగా భక్తులతో పూజలు అందుకుంటున్నాడు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 21, 22, 23వ తేదీల్లో నిర్వహించే మహాజాతర మహోత్సవానికి మూడు జిల్లాల నుంచి భక్తులు హాజరుకానుండగా.. నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తిచేశారు..
సిద్ధేశ్వరా నమోనమః!
బచ్చన్నపేట: ఉమ్మడి జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రాల్లో ఒకటైన జనగామ జిల్ల బచ్చన్నపేట మండలంలోని కొడ్వటూరు గ్రామంలోని శ్రీ సిద్ధేశ్వర ఆలయం మహా శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబవుతోంది. బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నేటి నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు గంగపూజ, ఋత్వికరణం, అవాహన దేవత పూజ, 20న ఏకదశరుద్రాభిషేకం, రుద్రహోమం, శతరుద్రాభిషేకం, 21వ తేదీన మహాశివరాత్రి పర్వదినాన శ్రీ భద్రకాశి వీరభద్రేశ్వరస్వామి ఆహ్వానం, రాత్రి శివపార్వతుల కల్యాణం, లింగోద్భవ పూజ ఉంటాయి. 22న ఉదయం అగ్నిగుండ ప్రవేశం, గెలుపు ఆశీర్వాదంతో ఈ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. స్వామి కల్యాణానికి జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించనున్నారు. బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment