
సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి
సాక్షి, షాద్‌నగర్: కాంగ్రెస్ నాయకులు గల్లీలో కాదు ఢిల్లీలో పోరాటం చేసి పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా తీసుకరావాలని మహబూబ్‌నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం షాద్‌నగర్‌లోని ఆర్‌ఆండ్‌బీ అతిథిగృహంలో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహబూబ్‌నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ... టీఆర్‌ఎస్ ప్రభుత్వం పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని అన్నారు.
ప్రాజెక్టు నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేసేందుకు సీఎం కేసీఆర్ తగిన చర్యలు చేపట్టారని అన్నారు. రెండేళ్లలో పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తికావడం ఖాయమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు పాలమూరు ఎత్తిపోతల పథకంపై లేని పోని రాద్దాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా సాధించేందుకు కాంగ్రెస్, బీజెపీ నాయకులు పోరాటం చేయాలని అన్నారు. లక్ష్మీదేవునిపల్లి ప్రాజెక్టు నిర్మించకుంటే వచ్చే ఎన్నికల్లో తాము ప్రజల నుండి ఓట్లు అడగమని అన్నారు.
లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారు..
ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మాట్లాడుతూ.. లక్ష్మీదేవునిపల్లి ప్రాజెక్టు నిర్మాణానికి భూ సేకరణ చేయాలని సీఎం కేసీఆర్ ఇటీవల అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. త్వరలో భూ సేకరణ పనులు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. లక్ష్మీదేవునిపల్లి ప్రాజెక్టు నిర్మించాలని మొదట సీఎం కేసీఆర్ చెప్పారని అన్నారు. కాంగ్రెస్‌పార్టీ హయాంలో ప్రాజెక్టు నిర్మాణం వారికి సాధ్యం కాలేదని, సీఎం కేసీఆర్ యుద్ధ ప్రాతిపదికన రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులను నిర్మిస్తున్నారని అన్నారు. దీంతో కాంగ్రెస్‌పార్టీ నేతలకు ఏమితోచక లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో నాయకులు అందెబాబయ్య, కొందూటి నరేందర్, అగ్గునూరు విశ్వం, ఎంపీపీ ఖాజా ఇద్రీస్ అహ్మద్, జెడ్పీటీసీ వెంకట్‌రాంరెడ్డి, ఎంఎస్ నట్‌రాజ్, ఎమ్మె సత్యనారాయణ, యుగెంధర్, చింటు, మన్నె నారాయణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment