నిను మరవలేం బిడ్డా!
నాలుగు గ్రామాల్లో వీడని విషాద ఛాయలు
గజ్వేల్/తూప్రాన్: స్కూల్‌కు టైమ్ అయ్యింది.. టిఫిన్ కూడా తెచ్చిన.. తొందరగా బడికిపోవాలె లేవుండ్రి బిడ్డా! నీకు బ్రెడ్ తెచ్చిన..చాయ్ తెచ్చిన.. ఇప్పుడైనా లేవుండ్రి కన్నా.. అంటూ తమ పిల్లలు ఇక లేరని తెలిసి కూడా ఆ తల్లిదండ్రులు పడిన వేదనను చూసి చలించని వారు లేరు. మాసాయిపేట దుర్ఘటనలో మరణించిన చిన్నారులు దివ్య-చరణ్‌లను తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లిలో ఖననం చేసిన ప్రదేశంలో శుక్రవారం నాటి దృశ్యమిది. వారి తల్లిదండ్రులు జక్కుల సంతోష-యాదగిరి రోదనలతో ఆ ప్రాంతం కంపించింది. జరిగిన ఘోరాన్ని తలచుకుంటూ గ్రామస్థులంతా కంటతడి పెట్టారు. ఇతర బాధిత కుటుంబాలున్న కిష్టాపూర్, వెంకటాయపల్లి, ఇస్లాంపూర్ గ్రామాల్లోనూ ఇంకా విషాద ఛాయలే నెలకొన్నాయి. నిన్నటివరకు ఉదయాన్నే స్కూలు బస్సు వద్ద సందడి చేసే పిల్లలంతా ఇక లేరనే నిజం గ్రామస్థుల గుండెలను పిండేస్తూనే ఉంది. కంటికిరెప్పలా చూసుకున్న కన్నబిడ్డలను తలచుకుంటూ తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు.