జనాభాలో 3 శాతం ఉన్న రెడ్డి, వెలమలకు 10 మంత్రి పదవులు కేటాయించారని, 50 శాతం ఉన్న మహిళలకు మాత్రం ఒక్క పదవీ కేటాయించకుండా వారిని అవమానిస్తున్నారని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ఏనూతుల నాగేష్‌మాదిగ అన్నారు.
రంగారెడ్డి (ఘట్‌కేసర్) : జనాభాలో 3 శాతం ఉన్న రెడ్డి, వెలమలకు 10 మంత్రి పదవులు కేటాయించారని, 50 శాతం ఉన్న మహిళలకు మాత్రం ఒక్క పదవీ కేటాయించకుండా వారిని అవమానిస్తున్నారని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ఏనూతుల నాగేష్‌మాదిగ అన్నారు. ఘట్‌కేసర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో శనివారం జరిగిన పార్టీ కార్యక్రమానికి నాగేష్‌మాదిగ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జనాభాలో సగం ఉన్న మహిళలకు తెలంగాణ సీఎం కేసీఆర్ తన మంత్రివర్గంలో చోటులేకుండా చేయడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే మంత్రివర్గంలో మహిళలకు చోటు కల్పించాలని, లేనిపక్షంలో ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని హెచ్చరించారు. మంత్రివర్గంలో మహిళలకు చోటు కల్పించాలని కోరుతూ నగరంలోని ఇందిరాపార్కు దగ్గర జూన్ 5వ తేదీన చేపట్టనున్న మహిళా గర్జనకు మహిళలు పెద్ద ఎత్తున హాజరు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎమ్మార్పీఎస్ మండల శాఖ అధ్యక్షుడు గంగి జగన్‌మాదిగ ఆధ్వర్యంలో మహిళా గర్జన వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు.