ఖచ్చితంగా భరించాలి.. | Must Follow Election Code | Sakshi

ఖచ్చితంగా భరించాలి...

Nov 10 2018 12:04 PM | Updated on Nov 10 2018 12:16 PM

Must Follow Election Code - Sakshi

ఖమ్మం, సహకారనగర్‌ : ముందస్తు ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్థుల ప్రచారం జోరుగా సాగుతున్న ప్రస్తుత తరుణంలో పోటీలో ఉన్న వివిధ పార్టీల అభ్యర్థులు, వీరి వెంట ఉండే నాయకులు, శ్రేణులు అంతా ఎన్నికల నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. కఠిన నియమాలను కచ్చితంగా పాటించాలి. ఇంకో రకంగా చెప్పాలంటే భరించాలి. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల పరిధిలో అభ్యర్థులు ప్రచారం జోరుగా కొనసాగిస్తున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు సైతం ఓట్ల కోసం పరుగులు తీస్తున్నారు. ఇంకా మహాకూటమి అభ్యర్థులు రంగంలోకి దిగే తరుణం ఆసన్నమైంది. ముందురోజుల్లో ప్రచారం హోరెత్తనుంది. ఇటు జనం మధ్య తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తూనే, అటు సామాజిక మాధ్యమాల్లో సైతం శక్తిమేర విస్తృత ప్రచారం చేయబోతున్నారు. వాట్సప్, ఫేస్‌బుక్‌లు వేదికగా దూసుకుపోనున్నారు. నిబంధనల ఉల్లంఘనలు చోటు చేసుకుంటే..చిక్కులు వచ్చి పడతాయి.   

క్రిమినల్‌ కేసులు  చెప్పాల్సిందే మరి..
నామినేషన్‌ వేసే అభ్యర్థులపై ఏమైనా  క్రిమినల్‌ కేసులు ఉంటే..వాటి వివరాలను అక్టోబర్‌ 23 నుంచి డిసెంబర్‌ 5వ తేదీలోగా మూడు సార్లు ప్రధాన దినపత్రికల్లో ప్రచురించాలి. ప్రధాన టెలివిజన్‌ చానెళ్లల్లో ప్రసారం అయ్యేట్లు చూడాలి. దినపత్రికల్లో ప్రచురితమైన సమాచారాన్ని అభ్యర్థి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌కు అందజేయాల్సి ఉంటుంది. నామినేషన్‌ వేసే అభ్యర్థి తన తాజా పాస్‌పోర్టు ఫొటోలను ఇవ్వాలి. అభ్యర్థి ఒక ఎన్నికల ఏజెంట్‌ను, ఖర్చుల వివరాలు చూసుకునేందుకు మరో ఏజెంట్‌ను నియమించుకోవచ్చు. ఖర్చుల వివరాలను ఎప్పటికప్పుడు ఏజెంట్‌ ద్వారా ఎన్నికల అధికారి కార్యాలయంలోని వ్యయ పర్యవేక్షణ విభాగంలో దాఖలు చేయడం కచ్చితం అని గుర్తించాలి.  

మీపై ఫోన్‌ నిఘా
ఈ ఎన్నికల వేళ అభ్యర్థులు చేసే తప్పిదాలు..సామాన్యుల చేతిలోని స్మార్ట్‌ఫోన్‌ ద్వారా ఎన్నికల సంఘానికి తెలుస్తాయని గుర్తించాలి. ప్రతి ఓటరుకూ ఉల్లంఘనలపై ప్రశ్నించే, ఫిర్యాదు చేసే హక్కును కల్పిస్తూ ఎలక్షన్‌ కమిషన్‌ సరికొత్తగా సీ–విజిల్‌ యాప్‌ను తీసుకొచ్చింది. డబ్బు పంపిణీ, మద్యం అందజేత, ఇతర ప్రలోభాలకు సంబంధించి ఫొటోలు, నిర్దేశించిన సమయం నిడివి గల వీడియోలను నేరుగా అప్‌లోడ్‌ చేసుకోవచ్చు. సంబంధిత ఉన్నతాధికారులు పరిశీ లించి,  ఇది నిజమేనని నిర్ధారిస్తే..ఆ తర్వాత చర్యలకు అవకాశం ఉంటుంది.

ఇలా చేయొద్దు.. 
అభ్యర్థి, పార్టీ, కుల, మత భాషా ద్వేషాలను రెచ్చగొట్టొద్దు 
విధానాలు, కార్యక్రమాలపైనే విమర్శలు ఉండాలి 
ఓటు కోసం డబ్బు ఇవ్వడం, బెదిరించడం నిషేధం 
గతంలో చేసిన పని రికార్డుపై ఉండాలి. వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేయకూడదు 
మందిరాలు, మసీదులు, చర్చిలు, ఇతర ప్రార్థనా మందిరాలను ప్రచారానికి ఉపయోగించొద్దు 
వ్యక్తుల అనుమతులు లేకుండా వాళ్లభూమిని, ఇంటిని ప్రచారానికి వినియోగించొద్దు 
కుల, మత ప్రాతిపదికన ఓట్లు అడగొద్దు 
ఇతర పార్టీల ఎన్నికల ప్రచారాలు, సమావేశాలను ఆటంకపరచొద్దు 
అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి 
స్వతంత్రులు కూడా వి«ధిగా పోలీసుల నుంచి లిఖితపూర్వకంగా అనుమతి పొందాలి 
సభలు, సమావేశాలు జరిగే ప్రాంతాలను తెలియజేయాలి 
సమావేశాలు, ఊరేగింపులు, ప్రచారాలకు మైక్‌ అనుమతి తప్పనిసరి 

గతంలో ఏడుగురిపై వేటు
కలెక్టర్, జిల్లా పరిపాలనా అధికారి ఎన్నికల నిర్వహణ సరళిని పర్యవేక్షిసుంటారు. నియోజకవర్గాల వారీగా రిటర్నింగ్‌ అధికారులు ఉంటారు. ఉల్లంఘనలకు సంబంధించి..క్షేత్రస్థాయి నుంచి ఫిర్యాదు వస్తే..కలెక్టర్‌ తుది పరిశీలన చేసి.. రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపిస్తారు. ఆ తర్వాత చర్యలు ఉంటాయి. 2014లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎన్నికల ప్రచారానికి‡ సంబంధించి ఏడుగురు స్వతంత్య్ర అభ్యర్థులు సరైన లెక్కలు చూపించలేదని తేలడంతో వారిపై 2020వరకు పోటీ చేసేందుకు వీలు లేకుండా అనర్హత వేటు పడింది. ఈసారికూడా ఉల్లంఘిస్తే..అభ్యర్థులపై చర్యలకు ఆస్కారముంటుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement