డబుల్‌బెడ్ రూం ఇళ్ల నిర్మాణంలో కొత్త టెక్నాలజీని వినియోగించుకోనున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ముఖ్య కార్యదర్శి అశోక్‌కుమార్ తెలిపారు.
జగదేవ్‌పూర్(మెదక్): డబుల్‌బెడ్ రూం ఇళ్ల నిర్మాణంలో కొత్త టెక్నాలజీని వినియోగించుకోనున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ముఖ్య కార్యదర్శి అశోక్‌కుమార్ తెలిపారు. బుధవారం సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన ఎర్రవల్లిలోడబుల్‌బెడ్ రూం ఇళ్లను ఆయన పరిశీలించారు. నమూనా కోసం పూర్తి చేసిన రెండు ఇళ్లలో కలియ తిరిగి వసతులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కట్టిస్తున్న డబుల్‌బెడ్ రూం ఇళ్లు చాలా అద్భుతంగా ఉన్నాయని అన్నారు.
ఎర్రవల్లిలో డబుల్‌బెడ్ రూం ఇళ్ల నిర్మాణ వ్యయం రూ.5.04లక్షల కంటే ఎక్కువ అవుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. సీఎం కేసీఆర్ కూడా రూ. 5 లక్షల వ్యయంతోనే డబుల్‌బెడ్ రూం ఇళ్లు నిర్మించాలని సూచించినట్లు చెప్పారు. దీని కోసం ఇళ్ల నిర్మాణంలో కొత్త టెక్నాలజీపై ముఖ్య అధికారులు, ఇంజనీర్‌లతో వర్క్‌షాపు కొనసాగిందని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే రూ. ఐదు లక్షలతోనే ఇళ్లను నిర్మించే విధంగా చర్చలు జరిగినట్లు చెప్పారు. గత ఏడాది 70 వేల డబుల్‌బెడ్ రూం ఇళ్లు మంజూరు కాగా ఈ ఏడాది రెండు లక్షల ఇళ్లు మంజూరు అయినట్లు వివరించారు. ప్రస్తుతం ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలతో పాటు వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో డబుల్‌బెడ్ రూం ఇళ్ల నిర్మాణం ప్రారంభం అయినట్లు తెలిపారు.