- పాతబస్తీ నుంచి న్యూసిటీలోకి మజ్లిస్
- 18 అసెంబ్లీ, మూడు లోక్‌సభ స్థానాలకు పోటీ
- బీసీ,ఎస్సీ,క్రిస్టియన్‌లకు రెండు లోక్‌సభ, ఐదు అసెంబ్లీ సీట్లు
- మహిళలకు దక్కని ప్రాధాన్యం
సాక్షి,సిటీబ్యూరో: ఇప్పటివరకు పాతబస్తీకే పరిమితమైన మజ్లిస్ పార్టీ ఈసారి గ్రేటర్‌వ్యాప్తంగా ఎన్నికల బరిలో దిగింది. మొత్తం మూడు లోక్‌సభ, 18 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది. ఈసారి జరుగుతున్న ఎన్నికలు రసవత్తరంగా ఉండడంతో సాధ్యమైనంత వరకు పోటీలో ఉంచింది. ఎస్సీ,బీసీ,మైనార్టీ ఐక్యత పేరుతో లోక్‌సభ,అసెంబ్లీ సీట్ల కేటాయింపులో ఆయా సామాజికవర్గాలకు తగిన ప్రాధాన్యం కల్పించింది. గ్రేటర్‌లో మొత్తం 24 నియోజకవర్గాలకుగాను పోటీకి దిగిన 18 స్థానాల్లో అభ్యర్థులను బరిలో దింపగా..అందులో ఐదుస్థానాలను బీసీ,ఎస్సీ,క్రిస్టియన్ మైనార్టీలకు కేటాయించి, మిగిలిన 13 సీట్లలో ముస్లిం మైనార్టీలకు ప్రాధాన్యం కల్పించింది.
రెండు లోక్‌సభ, ఐదు అసెంబ్లీల్లో : మజ్లిస్ పార్టీలో బీసీ,ఎస్సీ,క్రిస్టియన్ మైనార్టీవర్గాలకు రెండు లోక్‌సభ, ఐదు అసెంబ్లీసీట్లు దక్కాయి. సికింద్రాబాద్ లోక్‌సభ నుంచి దళితుడైన నార్ల మోహన్‌రావు, మల్కాజిగిరి లోక్‌సభకు వెనుకబడిన తరగతులకు చెందిన దివాకర్ ధరణికోటలకు అవకాశం కల్పించింది. అంబర్‌పేట, ఉప్పల్ నియోజకవర్గాల నుంచి దళితులైన నలిగంటి శరత్, యుగేందర్‌లకు అవకాశం దక్కగా, జూబ్లీహిల్స్ స్థానానికి చిన్నశ్రీశైలంయాదవ్ కుమారుడైన నవీన్‌యాదవ్, మల్కాజిగిరి సీటు ధరణికోట సుధాకర్‌కు కేటాయింపుతో బీసీలకు ప్రాధాన్యం కల్పించినట్లయ్యింది. అలాగే సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి క్రిస్టియన్ మైనార్టీవర్గానికి చెందిన జెమ్స్‌సిల్వెస్టర్‌కు అవకాశం కల్పించారు.
ఐదుగురు సిట్టింగులే : నగరంలో మజ్లిస్ పార్టీ తరఫున ఒక ఎంపీ, ఐదుగురు ఎమ్మెల్యేలు తిరిగి సిట్టింగ్ స్థానాల నుంచే నామినేషన్ల దాఖలు చేశారు. అదేవిధంగా జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్‌తోపాటు మరో కార్పొరేటర్ భర్త అసెంబ్లీస్థానాలకు, మరో మాజీకార్పొరేటర్ భర్త లోక్‌సభ నుంచి పోటీలో ఉన్నారు. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి రెండుసార్లు ప్రాతినిధ్యం వహించిన అసదుద్దీన్ ఒవైసీ మళ్లీ బరిలో దిగారు. చాంద్రాయణగుట్ట నుంచి అక్బరుద్దీన్ ఒవైసీ, చార్మినార్ నుంచి పాషాఖాద్రీ, మలక్‌పేట నుంచి అహ్మద్‌బలాల, యాకుత్‌పురా నుంచి ముంతాజ్‌ఖాన్, బహుదూర్‌పురా నుంచి మోజంఖాన్‌లు మరోమారు అదృష్టం పరీక్షించుకోనున్నారు. మరో రెండు సిట్టింగ్ స్థానాలైన కార్వాన్ నుంచి కార్పొరేటర భర్త కౌసర్ మొయినోద్దీన్, నాంపల్లి నుంచి డిప్యూటీ మాజీమేయర్, కార్పొరేటర్ జాఫర్‌హుస్సేన్ మేరాజ్‌లు తలపడుతున్నారు.
సాధారణ కార్యకర్తలకే : ఈసారి ఎన్నికల్లో పార్టీ సాధారణ కార్యకర్తలకు కూడా అవకాశం కల్పించింది. సిట్టింగ్ స్థానాలను వదిలి మిగిలిన లోక్‌సభ,అసెంబ్లీ స్థానాలకు కొత్తవారినే బరిలోకి దించింది. శేరిలింగంపల్లి నుంచి నజీర్‌ఖాన్, పటాన్‌చెరు నుంచి సయ్యద్హ్రమత్, కుత్బుల్లాపుర్ నుంచి మహ్మద్‌గౌసోద్దీన్, మహేశ్వరం నుంచి షేక్‌అహ్మద్, ముషీరాబాద్ నుంచి ఖాసీంషాహీన్, రాజేంద్రనగర్ నుంచి జాకీర్ హుస్సేన్‌జావిద్‌లకు అవకాశం దక్కింది. ఇప్పటివరకు ఉన్న స్థానాలతోపాటు ఈసారి కొత్తగా సీట్లను కైవసం చేసుకునేందుకు పార్టీ శ్రేణులు సమాయత్తమవుతున్నారు.