సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల విషయంలో ప్రభుత్వ తీరుతో విసిగిపోయిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పుడు న్యాయ పోరాటానికి దిగింది. రాష్ట్రంలోని పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా నిర్దిష్ట కాల వ్యవధిలో.. బీసీలతోపాటు అన్ని రిజర్వేషన్లను ఖరారు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించింది.
గడువు ముగిసినా పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోవడంలో తమ తప్పేమీ లేదని, ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేయకపోవడం వల్లే తాము ఎన్నికల విషయంలో ముందుకు వెళ్లలేకపోతున్నామని పేర్కొంది. అందువల్ల ఈ విషయంలో ప్రభుత్వానికి తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఈసీ కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై వచ్చే వారం హైకోర్టు విచారణ జరిపే అవకాశం ఉంది.
మేమేం చేయాలో అన్నీ చేశాం కానీ..
‘ఉమ్మడి రాష్ట్రంలో (2013లో) పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. వీటి కాలపరిమితి ఈ ఏడాది ఆగస్టు 1తో ముగిసింది. ఐదేళ్ల కాల పరిమితి ముగిసిన పంచాయతీలకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 (ఇ) (3) ప్రకారం ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంది. వార్డుల పునర్విభజన, వార్డులు–పంచాయతీల వారీగా ఓటర్ల జాబితా ప్రచురణ, రిజర్వేషన్ల ఖరారు, పోలింగ్ స్టేషన్ల ఖరారు ఇవన్నీ కూడా ఎన్నికల నిర్వహణలో భాగం. గ్రామ పంచాయతీలు ఖరారైన తర్వాత ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రచురిస్తుంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తూ ఈ ఏడాది మార్చి 10న రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశాం.
ఆ తరువాత ఎప్పటికప్పుడు ఎన్నికల గురించి ప్రభుత్వానికి గుర్తు చేస్తూ వచ్చాం. వార్డులు, పంచాయతీల వారీగా ఓటర్ల జాబితా తయారీ కోసం.. ఏప్రిల్ 20న నోటిఫికేషన్ జారీ చేశాం. ఆ రోజుకి 12,751 గ్రామ పంచాయతీలు, 1,13,380 వార్డులు, 1,38,624 పోలింగ్ కేంద్రాలు, 3,26,561 మంది ఎన్నికల సిబ్బంది అవసరం ఉంది. ఆ తరువాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర శాఖల కార్యదర్శుల వద్ద పలు సమావేశాలు జరిగాయి. వీలైనంత త్వరగా వార్డుల రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేయాలన్న నిర్ణయం జరిగింది.
ఆ తరువాత జిల్లా కలెక్టర్లు, ఎస్‌పీలతో ప్రత్యేక సమావేశం కూడా నిర్వహించాం. జూన్ 23న ఎన్నికల పరిశీలకులను కూడా నియమించాం. నిర్దేశించిన గడువులోపు ఎన్నికలను పూర్తి చేయడానికి అవసరమైన అన్నీ చర్యలను మా వంతుగా చేపట్టాం. జూన్ 25 కల్లా రిజర్వేషన్లు ఖరారు చేయాలని మరోసారి ప్రభుత్వానికి సూచించాం. అయితే ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేయడం గానీ, మేం ప్రతిపాదించిన షెడ్యూల్‌తో ఏకీభవించడం గానీ చేయలేదు. మా పరిధిలో మేం ఏం చేయాలో అన్నీ చేశాం. ఎన్నికల విషయంలో మా తప్పేమీ లేదు’అని అశోక్‌కుమార్ కోర్టుకు వివరించారు.
బీసీ జనాభాను తేల్చిన తర్వాతే..
ఇదే సమయంలో ముందుగా బీసీ జనాభాను తేల్చి ఆ తరువాత ఎన్నికలు నిర్వహించాలని ఇదే హైకోర్టు ఈ ఏడాది జూన్ 26న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల తరువాత జూలై 6న మేం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశాం. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 50% దాటకుండా రిజర్వేషన్లను ఖరారు చేయాలని కోరాం. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సహకరించని పక్షంలో.. హైకోర్టును ఆశ్రయించ వచ్చని కిషన్‌సింగ్ తోమర్ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. బీసీ తరగతులు, ఉప తరగతుల గుర్తింపునకు ఎంతో సమయం పడుతుంది.
ఈ అంశంపై తదుపరి న్యాయపరమైన వివాదాలు కూడా చెలరేగే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో పంచాయతీల ఎన్నికలు నిరవధికంగా వాయిదా పడే అవకాశం ఉంది. ఈ సమయంలో పంచాయతీలు ప్రత్యేకాధికారుల పాలనలో ఉండటం.. రాజ్యాంగ విరుద్ధం. రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. అందుకే బీసీ తరగతులతో సహా అన్ని రిజర్వేషన్లను నిర్దిష్ట కాలపరిమితిలో ఖరారు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించండి’అని అశోక్‌కుమార్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment