
నార్సింగిలో రైతులపై పోలీసుల లాఠీఛార్జ్
మెదక్ : విద్యుత్ కోతలపై రోడ్డెక్కిన అన్నదాతలపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. విద్యుత్ కోతలను నిరసిస్తూ సోమవారం రైతులు హైవేపై ఆందోళన చేపట్టారు. విద్యుత్ కోతలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ నార్సింగి వద్ద 44వ జాతీయ రహదారిపై రైతులు ఆందోళనకు దిగారు. అయితే ఆందోళన చేస్తున్న రైతులను పోలీసులు అడ్డుకోవటంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.
పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఆందోళనకు దిగిన రైతులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దాంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు కూడా తిరగబడ్డారు. నిలిపి ఉన్న ఓ పోలీస్ జీపును ధ్వంసం చేశారు. రైతులు రాళ్లదాడి చేయటంతో హైవేపై ఉన్న ఎనిమిది బస్సులు ధ్వంసం అయ్యాయి. మరోవైపు ఈ ఘటనలో పలువురు రైతులు గాయపడ్డారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.