సాక్షి, కరీంనగర్: కేంద్రం అనాలోచిత నిర్ణయాల వల్ల భారత ఆర్థికవ్యవస్థ కుప్పకూలిపోయిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. రేపటి(నవంబర్ 7)తో పెద్దనోట్ల రద్దుకు మూడేళ్లు అవుతుదని.. శుక్రవారం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసనలు చేపడతామన్నారు. ధర్నాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు. ఏడాదికి కోటి ఉద్యోగాలు, ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామన్న హామీ ఏమైందని కేంద్రాన్ని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని బెదిరింపులకు పాల్పడినా.. వాటికి లొంగకుండా సమ్మె చేస్తున్న టీఎస్‌ఆర్టీసీ కార్మికులకు అభినందనలు తెలిపారు. హైకోర్టు చేస్తున్న కామెంట్లు ప్రభుత్వానికి చెంపపెట్టు వంటివన్నారు.
కేసీఆర్ ఆర్టీసీని ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. రూ.3 లక్షల కోట్ల అప్పులు చేసిన సర్కారు.. ఆర్టీసీకి రూ. 40 కోట్లు ఎందుకు ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. ఐఏఎస్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తుంటే కేంద్రం ఏం చేస్తోందని ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమకారులమని చెప్పుకునే మంత్రులు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికుల ఉసురు ఈ సర్కారుకు తగిలి తీరుతుందన్నారు. హైకోర్టుపై గౌరవం లేకుండా ‘కోర్టేమైనా కొడుతుందా?’ అంటూ కేసీఆర్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆర్టీసీ విషయంలో టీఆర్ఎస్, బీజేపీలు నకిలీ ఫైటింగ్ చేస్తున్నారని దుయ్యబట్టారు. సకల జనుల సమ్మెలో సమైక్య సర్కారు ఒక్కరి ఉద్యోగమైనా తీసిందా అని పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment