పేదలకు మాటలు.. పెద్దలకు చేతలు
⇒ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొడతాం
⇒జిల్లాలో పార్టీ విస్తరణకు పకడ్బందీ ప్రణాళిక
⇒పోడు భూముల సమస్యపై మరో ఉద్యమం
⇒ఈ ప్రభుత్వానిదీ అవకాశవాద వైఖరే...
⇒సీపీఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్‌రావు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: పేదలకు మాటలు చెబుతూ పెద్దల కోసం పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వ అవకాశవాద వైఖరిని ఎండగట్టేందుకు జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు నిర్మిస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్‌రావు అన్నారు. శుక్రవారం నుంచి మూడురోజులపాటు మధిరలో జరిగే పార్టీ జిల్లా మహాసభలను పురస్కరించుకొని పార్టీ ఉద్యమ కార్యాచరణ- విస్తరణ అంశాలపై గురువారం ఆయన ‘సాక్షి’ ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే..
ప్రజాసమస్యలపై ప్రభుత్వానికి స్పష్టత లేదు... ప్రజల సంక్షేమం కోసం రూపొందించిన అనేక పథకాల అమలులో కేసీఆర్ ప్రభుత్వానికే సరైన స్పష్టత లేదు. ప్రజలను ఆకట్టుకోవడానికి ఇచ్చే ప్రాధాన్యత పేదలకు సంక్షేమాన్ని పంచడానికి ఇవ్వలేకపోతున్నారు ఈ తరహా పాలనపై తమ పార్టీ రాబోయే రోజుల్లో ఆందోళనలు నిర్వహించడానికి సమాయత్తం అవుతోంది. జిల్లాలో సీపీఎంను అన్ని మండలాలు, గ్రామాల్లో మరింత పటిష్టపరిచేందుకు కార్యాచరణ రూపొందించుకుంటాం.
ప్రజా ఉద్యమాల నిర్మాణం..ప్రజా సమస్యల పరిష్కారంలో కీలక భూమిక పోషించిన ఘనత మా పార్టీకి ఉంది. రూ.3.50లక్షలతో పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కట్టించి ఇస్తామన్న కేసీఆర్ ఇప్పుడు మాట మారుస్తున్నారు. అందులో రూ.లక్ష పేదలు చెల్లించాలన్న నిబంధన పెట్టారు. లక్ష రూపాయలు ఇవ్వగలిగిన వారు పేదవారు ఎలా అవుతారు?.
ఎన్నో ఉద్యమాలు నిర్మించాం.. మూడేళ్లుగా జిల్లాలో ప్రధాన సమస్యల పరిష్కారం కోసం మా పార్టీ అనేక ఉద్యమాలు నిర్వహించింది. పాలక వర్గాలు దిగివచ్చి పలు సమస్యలను పరిష్కరించాయి. మరికొన్ని పెండింగ్‌లో ఉన్నాయి. వాటి పరిష్కారం కోసం మరిన్ని ఉద్యమాలు చేస్తాం. జిల్లాలో రూ.10 వేల కోట్లతో 10 లక్షల ఎకరాల భూమిని సాగు చేసే అవకాశం ఉంది. మూడు పంటలు పండించడానికి అనువైన పరిస్థితి ఉంది. వీటిపై ప్రభుత్వాన్ని కదిలించేందుకు సాగునీటి సాధన యాత్ర నిర్వహించాం.
దుమ్ముగూడెం నుంచి పాలేరు వరకు, అక్కడి నుంచి ఖమ్మం వరకు 12 రోజులపాటు 1000 మందితో నిర్వహించిన పాదయాత్ర ప్రభుత్వాన్ని కదలించింది. మా ఆందోళనల ఫలితంగా అప్పటి కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కార్ రూ.100 కోట్లు అదనంగా కేటాయించింది. దుమ్ముగూడెం రాజీవ్‌సాగర్ ప్రాజెక్టు ద్వారా జిల్లా సస్యశ్యామలం కావాలంటే ప్రభుత్వం రూపొందించిన డిజైన్‌ను మార్చాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు ఖమ్మం రూరల్ మండలం వరకే ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు.
మున్నేరు మీద అక్విడేట్ నిర్మించి దీని ద్వారా పాలేరు వరకు పొడిగిస్తే రెండున్నర లక్షల ఎకరాలకు సాగు నీరు అందే అవకాశం ఉంది. అలాగే మరో రెండున్నర లక్షల ఎకరాలకు సాగర్ ద్వారా నీరు అందుతుంది. మేము చేసిన పోరాటాల ఫలితంగానే దుమ్ముగూడెం నుంచి సాగర్ టేల్‌పాండ్‌ను రద్దు చేశారు. దీనిపై కేసీఆర్ ప్రభుత్వం విధి విధానాలను వెల్లడించాల్సి ఉంది. భవిష్యత్‌లోనూ జిల్లాలో మిత్రపక్షమైన సీపీఐతో కలిసి ఐక్య కార్యాచరణ ఉద్యమాలు నిర్వహిస్తాం.
ఐక్య ఉద్యమాల ఆవశ్యకత పెరిగింది... తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఐక్య ఉద్యమాల ఆవశ్యకత మరింత పెరిగింది. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేయాలనే డిమాండ్‌తో త్వరలో ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలని యోచిస్తున్నాం. బయ్యారంలో ఉక్కు కర్మాగారాన్ని నిర్మించాలని డిమాండ్ చేస్తున్నాం. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలనే డిమాండ్‌తో మరో ఉద్యమం చేస్తాం. జిల్లాలో అటవీ హక్కుల చట్టానికి తూట్లు పొడుస్తున్నారు.
అటవీ అధికారులు, గిరిజనులను అనేక ఇబ్బందులు, వేధింపులకు గురి చేస్తున్నారు. పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులకు పూర్తి హక్కు కల్పించేందుకు గిరిజనులతో కలిసి ఓ పెద్ద ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తాం. జిల్లాలో దళితులు, గిరిజనులకు విద్య, వైద్య, ఉపాధి, ఆరోగ్య అంశాల్లో తీరని అన్యాయం జరుగుతోంది. వీరికి ఆయా అంశాల్లో న్యాయం జరిగేందుకు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను వారి సంక్షేమానికే కేటాయించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం.
ఎస్సీ, ఎస్టీలకు ప్రైవేట్ రంగంలోనూ రిజర్వేషన్లు కల్పించాల్సిన ఆవశ్యకతపై దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమంలో జిల్లా నుంచి సీపీఎం ప్రధాన భూమిక పోషిస్తోంది.
గత ప్రభుత్వాల బాటలోనే టీఆర్‌ఎస్...గత ప్రభుత్వాలు ప్రజా సమస్యలపై పోరాడుతున్న పార్టీలపై నిర్బంధం కొనసాగించాయి. ఈ ప్రభుత్వం సైతం అదే ధోరణితో వ్యవహరిస్తోంది. జిల్లాలో అన్ని వర్గాల ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతున్న సీపీఎం తమకు గల ప్రజా పునాదిని రాజకీయంగా మలచుకోవడంలో కొంత వెనుకబడి ఉంది.
పకడ్బందీ రాజకీయవ్యూహాలతో తిరుగులేని శక్తిగా ఎదుగుతాం. నిజాం నవాబు నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా పోరాడి, వారి మూకల చేతిలో అమరులైన కొమరంభీమ్, దొడ్డి కొమురయ్యల త్యాగనిరతిని శ్లాఘిస్తూనే.. నిజాం నవాబును గొప్పవాడిగా పొగడటం కేసీఆర్ ద్వంద్వ వైఖరికి నిదర్శనం. దీనిపై ప్రజల్లో నెలకొన్న అనుమానాలను కేసీఆర్ నివృత్తి చేయాలి. టీఆర్‌ఎస్ వైఖరిని స్పష్టం చేయాలి.
రాజకీయంగా గతంలో జరిగిన పొరపాట్లను పరిగణలోకి తీసుకుని భవిష్యత్తులో అటువంటివి జరగకుండా మరింత చైతన్యవంతంగా వ్యవహరిస్తాం. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వకుండా ఉంటే బాగుండేదన్న అభిప్రాయం ఆ తర్వాత పార్టీలో మెజార్టీ సభ్యులు వ్యక్తం చేశారు. జిల్లాలో తునికాకు సేకరిస్తున్న గిరిజనులకు న్యాయమైన కూలి, పూర్తిస్థాయి బోనస్ లభించేందుకు ఉద్యమాలు చేయాలని యోచిస్తున్నాం. మూడు రోజులపాటు మధిరలో జరిగే జిల్లా మహాసభల్లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు తదితరులు పాల్గొంటారు.