జిల్లాలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. టీ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన ఆ పార్టీ కార్యకర్తల్లో ఆందోళనకు కారణమైంది. పార్టీ మారుతాడన్న విషయంలో మూడు రోజులుగా ఎక్కడ చూసినా ఒకటే చర్చ. పార్టీ కార్యకర్తలు, నాయకుల అంతరంగం ఏమిటి? సహచరులు ఏ వైపు చూస్తున్నారు? మనం ఎటు పయనించాలి అన్న తర్జనభర్జనలో ఉన్నారు. రేవంత్ పార్టీ మారుతారా? లేదా? మారితే.. జరిగే పరిణామాలు ఏమిటన్న విషయంలో స్పష్టత కరువైంది. అయితే నేడు కొడంగల్‌లో జరగనున్న టీడీపీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో రేవంత్ ఏ విషయం ప్రకటిస్తారోనన్న ఆసక్తి జిల్లా అంతటా నెలకొంది.
కొడంగల్: తెలుగుదేశం పార్టీకి మంచి పట్టున్న కొడంగల్ నియోజకవర్గంలో తెలుగుతమ్ముళ్లు అయోమయంలో ఉన్నారు. ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన పార్టీ మారుతున్నారన్న ఊహాగానాలు టీడీపీ కార్యకర్తలు, నాయకులను అయోమయానికి గురి చేసింది. గడిచిన 14 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ అధికారంలో లేకపోయినా ఈ నియోజకవర్గం నుంచి వరుసగా రెండు పర్యాయాలు రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒకసారి.. తెలంగాణ ఉద్యమకాలంలో రెండోసారి ఊహించని పరిస్థితుల మధ్య రేవంత్‌రెడ్డి విజయం సాధించారు. ఇటీవల కాలంలో జరిగిన ఆకస్మిక పరిణామాలు మీడియాలో వస్తున్న కథనాలు టీడీపీ నాయకులను ఆందోళకు గురి చేస్తున్నాయి. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు.. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో మంతనాలు జరిపినట్లు ప్రచారం జరిగింది. దీంతో తమ నాయకుడి పయనం ఎటువైపు ఉంటుందోనని టీడీపీ శ్రేణులు ఎదురుచూస్తున్నారు.
విభజన ప్రభావం..
ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన జిల్లాల విభజన కొడంగల్ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నియోజకవర్గాన్ని ఇక్కడి ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా రెండు ముక్కలు చేయడం వల్ల రాజకీయ సంక్షోభం ఏర్పడింది. కొడంగల్ దౌల్తాబాద్, బొంరాస్‌పేట మూడు మండలాలను వికారాబాద్‌లో, కోస్గి, మద్దూరు మండలాలను మహబూబ్‌నగర్ జిల్లాలో కలిపారు. దీంతో నియోజకవర్గ స్థాయి నాయకులు పట్టు కోల్పోయారు. కొడంగల్, దౌల్తాబాద్, బొంరాస్‌పేట మండలాల్లో మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి, కోస్గి, మద్దూరు మండలాల్లో మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డిల ప్రభావం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి.
రేవంత్ రాజకీయ ప్రస్తానం
మొదటిసారి మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలం జెడ్పీటీసీగా గెలుపొందారు. పదవిలో ఉండగానే ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ప్రాదేశిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా స్వతంత్రంగా పోటీ చేసి గెలుపొందారు. ఎమ్మెల్సీగా ఉండగానే కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2009లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు. 2014లో రెండోసారి టీడీపీ నుంచి పోటీ చేసి అప్పటి టీఆర్‌ఎస్ అభ్యర్థిపై సుమారు 15 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. రేవంత్‌రెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు పోటీ చేసిన నాలుగు ప్రత్యక్ష ఎన్నికల్లో ఓటమి లేకుండా విజయం వరించింది.
రేవంత్‌తోనే రాజుగౌడ్.. రసవత్తరంగా తాండూరు రాజకీయాలు
తాండూరుటౌన్ : టీ టీడీపీ నేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు వస్తున్న వార్తలతో తాండూరు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి మారిన తక్షణమే తాండూరులో రాజకీయ వేడి రాజుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటి వరకు తెలుగుదేశంలోనే కొనసాగుతూ రేవంత్‌రెడ్డి అనుచరుడిగా ఉన్న తాండూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి రాజుగౌడ్ సైతం అతడితోనే పయనం సాగించనున్నట్లు తెలుస్తోంది.
అయితే రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు, సుమారు 30 మందితో ఉన్న తన అనుచరగణం లిస్టును తయారు చేసి కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి రాహుల్‌గాంధీకి ఇచ్చినట్లు సమాచారం. ఆ లిస్టులో ఉన్న వారికి రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రాధాన్యత ఇవ్వాలని అందులో ఉన్నట్లు తెలిసింది. తాండూరులో జరిగిన టీడీపీ పోరుబాట కార్యక్రమంలో ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రాజుగౌడ్‌ను రేవంత్‌రెడ్డి గతంలోనే ప్రకటించిన విషయం విదితమే.
అయితే రాహుల్ గాంధీకి రేవంత్ ఇచ్చి జాబితాలో రాజుగౌడ్ పేరు సైతం ఉన్నట్లు తాజా సమాచారం. ఇదే గనుక జరిగితే.. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు సిద్ధమైన రమేష్ మహరాజ్, ఆయన వర్గం దీనిని స్వాగతించే పరిస్థితి కనబడటం లేదు. దీంతో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరులో రసవత్తర రాజకీయాలకు తెర లేవనున్నట్లు అవగతమవుతోంది. అసలు రేవంత్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటారో లేదో కానీ తాండూరు అసెంబ్లీ స్థానంపై మాత్రం జనాల్లో చర్చ హాట్ హాట్‌గా కొనసాగుతోంది. ఎవరు ఏ పార్టీలోకి వచ్చి ఏమి చేస్తారో వేచి చూడాల్సిన అవసరం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment