
ముగిసిన రేవంత్ రెడ్డి కస్టడీ: నేడు కోర్టుకు తరలింపు
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో అరెస్టయిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి జ్యుడీషియల్ కస్టడీ నేటి (సోమవారం)తో ముగియనుంది. దీంతో ఏసీబీ అధికారులు ఆయనను కోర్టులో హాజరుపర్చనున్నారు. ఈ వ్యవహారం ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేసేదిగా ఉందని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి లక్ష్మీపతి గతంలో పేర్కొన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డికి మరికొన్ని రోజులు రిమాండ్ విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ వ్యవహారంలో సోమవారం అత్యంత కీలక పరిణామాలు జరుగనున్నాయి. ఈ కేసులో ప్రధాన సాక్షి అయిన నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ వాంగ్మూలాన్ని మెజిస్ట్రేట్ ఎదుట నమోదు చేయనుండడంతో పాటు వీడియో, ఆడియో రికార్డులకు సంబంధించి ఫోరెన్సిక్ నివేదిక న్యాయస్థానానికి అందనుంది. చంద్రబాబు మాట్లాడిన ఆడియో టేపులు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో స్టీఫెన్‌సన్ వాంగ్మూలం కీలకం కానుంది.
రూ.5 కోట్లు లంచం తీసుకుని టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటేయాలంటూ ఆ పార్టీ నేతలు ఒత్తిడి తెస్తున్నారని ఫిర్యాదు చేసిన స్టీఫెన్‌సన్ వాంగ్మూలాన్ని నమోదు చేయాల్సిందిగా ఏసీబీ ఇప్పటికే కోర్టు అనుమతి కోరింది. ఈ మేరకు సీఆర్‌పీసీ సెక్షన్ 164 కింద మెజిస్ట్రేట్ సోమవారం స్టీఫెన్‌సన్ వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నారు. ‘ఓటుకు నోటు’ వ్యవహారంలో తనను ఎవరెవరు, ఏవిధంగా ప్రలోభపెట్టారు, ఎవరెవరు, ఏ హామీలిచ్చారన్న వివరాలను స్టీఫెన్‌సన్ తన వాంగ్మూలంలో వెల్లడించే అవకాశముంది. చంద్రబాబు తనతో ఎప్పుడు, ఎవరి ద్వారా ఫోన్‌లో మాట్లాడారో చెప్పనున్నారు.
ఇక రేవంత్‌రెడ్డి, ఉదయ్ సింహ, సెబాస్టియన్‌లు ఉపయోగించిన ఫోన్ల కాల్ డేటా, స్టీఫెన్‌సన్ ఫోన్‌లో రికార్డయిన సంభాషణలు, రహస్య కెమెరాల వీడియో ఫుటేజీలను ఇప్పటికే కోర్టు ద్వారా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్)కి పంపించిన సంగతి తెలిసిందే. వాటికి సంబంధించి ఎఫ్‌ఎస్‌ఎల్ నుంచి ప్రాథమిక నివేదిక ఇప్పటికే ఏసీబీకి అందింది. పూర్తిస్థాయి నివేదికలను ఎఫ్‌ఎస్‌ఎల్ సోమవారం కోర్టుకు సమర్పిస్తుందని అధికారవర్గాలు చెప్పాయి. ఈ నివేదిక కోర్టుకు అందితే విచారణ మరింత వేగవంతం కానుంది.