
రేవంత్ బెయిల్ పిటిషన్ విచారణ 24కి వాయిదా
పూర్తి వివరాలను కోర్టు ముందుంచేందుకు ఆదేశం
తనపై కేసును కొట్టేయాలంటూ హైకోర్టులో మత్తయ్య పిటిషన్
సాక్షి, హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో నిందితులుగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్‌సింహలు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లపై విచారణ ఈ నెల 24 కు వాయిదా పడింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను కోర్టు ముందుంచేందుకు వీలుగా హైకోర్టు విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో బుధవారం తీర్పు వెలువరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా ఓటు వేసేందుకు ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు డబ్బులు ముట్టజెప్పే ప్రయత్నాలు చేయడంతో రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్‌సింహలను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ రేవంత్‌రెడ్డి తదితరులు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లను ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం కొట్టేసింది. ఈ నేపథ్యంలో వారు బెయిల్ కోసం సోమవారం హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసుకున్నారు. ఈ వ్యాజ్యాలు బుధవారం హైకోర్టు ముందు విచారణకు వచ్చాయి. తాజాగా దాఖలయ్యే ప్రతీ బెయిల్ పిటిషన్‌ను కూడా ఆ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు కోర్టు ముందుంచేందుకు వీలుగా వారం పాటు వాయిదా వేయడం సంప్రదాయంగా వస్తోంది. అందులో భాగంగానే రేవంత్‌రెడ్డి, తదితరులు బెయిల్ పిటిషన్లను న్యాయమూర్తి వచ్చే వారానికి వాయిదా వేశారు. ఈ కేసులో నిందితునిగా ఉన్న మత్తయ్య తనపై పెట్టిన కేసును కొట్టివేయాలంటూ బుధవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
రంగంలోకి టీ అడ్వొకేట్ జనరల్..
ఇదిలా ఉంటే ఈ కేసులో అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి స్వయంగా వాదనలు వినిపించనున్నారు. సంచలనాత్మకంగా మారిన ఈ కేసులో రేవంత్‌రెడ్డికి బెయిల్ ఇస్తే తలెత్తే పరిణామాలు, ఇతరత్రా అంశాలను పరిగణనలోకి తీసుకున్న మీదట బెయిల్ పిటిషన్‌పై ఏజీ ద్వారా వాదనలు వినిపించాలని టీ సర్కార్ భావిస్తున్నట్టు తెలిసింది. ఏసీబీ తరఫు వాదనలు వినిపించేందుకు స్పెషల్ పీపీ ఉన్నప్పటికీ, రిస్క్ తీసుకోకూడదన్న ఉద్దేశంతో ఉన్న సీఎం కేసీఆర్.. అడ్వొకేట్ జనరల్‌ను రంగంలోకి దించినట్లు సమాచారం. రేవంత్‌రెడ్డి తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వాదనలు వినిపించనున్నట్లు తెలిసింది. ఏసీబీ కోర్టులో రేవంత్‌రెడ్డి తరఫున వాదనలు వినిపించిన సిద్ధార్థ లూత్రానే హైకోర్టులోనూ వాదనలు వినిపించనున్నట్లు సమాచారం.