సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పార్టీని వీడి వెళ్లినా నష్టమేమీ లేదని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు, అధికారాన్ని ఏళ్ల పాటు అనుభవించి ఇప్పుడు ఆమె పార్టీని ఎందుకు వీడి వెళ్లాల్సి వచ్చిందో పార్టీ కార్యకర్తలు, ప్రజలకు సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. గురువారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి (కేఎల్‌ఆర్), టి.రామ్మోహన్‌రెడ్డి (టీఆర్‌ఆర్), ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, అధికార ప్రతినిధి మురళీకృష్ణలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సబితా ఇంద్రారెడ్డి పార్టీని వీడి వెళ్లినా కార్యకర్తలు, నేతలెవరూ అధైర్యపడాల్సిన పనిలేదని చెప్పారు. కార్యకర్తల వెంట తాముంటామని, పార్టీని బతికించుకుంటామని వెల్లడించారు. సబితా కుటుంబంతో పాటు టీఆర్‌ఎస్‌లో చేరాలని కొందరు కాంగ్రెస్ నేతలను, కార్యకర్తలను బెదిరిస్తున్నారని, ఇలాంటి బెదిరింపులకు ఎవరూ భయపడొద్దన్నారు. చేవెళ్ల ఎంపీగా కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని గెలిపిస్తే రాహుల్ కేబినెట్‌లో ఆయన కేంద్రమంత్రి అవుతారని, అప్పుడు తమ ప్రాంత సమస్యలు పరిష్కరించుకుంటామని చెప్పారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్న కేసీఆర్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని వారు ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment