ఈ– కుబేర్‌ ద్వారా వేతనాలు    | Salaries by E Kuber | Sakshi
Sakshi News home page

ఈ– కుబేర్‌ ద్వారా వేతనాలు   

Published Wed, Aug 1 2018 9:11 AM | Last Updated on Wed, Aug 1 2018 9:11 AM

Salaries by E Kuber - Sakshi

ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు

జిల్లా వ్యాప్తంగా అన్ని శాఖల్లో కలిపి 7,343 మంది ఉద్యోగులు ఉన్నారు. తాండూరు, పరిగి, మోమిన్‌పేట్, కొడంగల్‌లో సబ్‌ ట్రెజరీ కార్యాలయాలు ఉన్నాయి. వీటి పరిధిలో 7,343 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరితో పాటు 3,933 మంది విశ్రాంత ఉద్యోగులు ఉన్నారు. వీరందరి వేతనాలు సబ్‌ ట్రెజరీ డీటీఓకు అక్కడి నుంచి బ్యాంకులకు వెళ్లే సరికి మూడు నాలుగు రోజుల సమయం పడుతోంది. ఈ నెల నుంచి ఇక జాప్యం జరగకుండా ఒకటో తేదీనే జీతాలు ఖాతాల్లో చేరనున్నాయి.

వికారాబాద్‌ అర్బన్‌ : జిల్లాలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు. ఇకనుంచి వేతనాల కోసం ఎదురుచూపులు తప్పనున్నాయి. ప్రభుత్వంలోని కొన్ని శాఖల్లో ఇప్పటికీ 1వ తేదీన ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు జమకావడం లేదు. దీనికి సంబంధించిన బిల్లులు చేయాల్సిన సిబ్బంది నిర్లక్ష్యంతోనో, ట్రెజరీలో జరుగుతున్న ఆలస్యం కారణంగానో.. ఉద్యోగులకు ప్రతి నెల మొదటి వారం వేతనాలు చేతికందుతున్నాయి.

కానీ ఆగస్టు నెల వేతనం నేరుగా ఉద్యోగుల అకౌంట్లలో క్రెడిట్‌ కానున్నాయి. అది కూడా 1వ తేదీ రోజునే. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ప్రవేశపెట్టిన నూతన విధానంలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ప్రయోజనం చేకూరనుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ– కుబేర్‌ అనే ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. ఆగస్టు 1నుంచి దీన్ని అమలు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

జీతాల చెల్లింపులో జాప్యానికి స్వస్తి పలికేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ట్రెజరీలో జరిగే చెల్లింపులన్నీ ఈ– కుబేర్‌ ద్వారానే కొనసాగుతాయి. ఇందులో భాగంగా ఆయా శాఖల ఉద్యోగుల నుంచి వారి బ్యాంక్‌ ఖాతాల వివరాలను సేకరించారు.   

నేరుగా బ్యాంక్‌ ఖాతాలోకే... 

ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు, ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు సంబంధించి ప్రతి నెల జీతాలు బిల్లులు తయారు చేసి సబ్‌ట్రెజరీ కార్యాలయానికి అందజేస్తారు. ఇక్కడ అధికారులు వీటిని పరిశీలించి బిల్లులను సంబంధిత లింక్‌ బ్యాంకులకు పంపిస్తారు.

ఈ ప్రక్రియ పూర్తైన తర్వాత ఉద్యోగుల వేతనాలు ఖాతాల్లో జమవుతాయి. అయితే ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో బ్యాంకుల్లో ఈ ప్రక్రియ పూర్తి కావడానికి మూడు, నాలుగు రోజులు పడుతోంది. దీంతో ప్రతి నెల నాలుగు, ఐదు తేదీల్లో వేతనాలు అందుతున్నాయి. ఈ జాప్యానికి స్వస్తి చెప్పేందుకు నేరుగా ఉద్యోగుల ఖాతాల్లో వేతనాలు జమ చేసేందుకు వీలుగా ఆర్‌బీఐ ట్రెజరీ కార్యాలయాల్లో ఈ – కుబేర్‌ విధానాన్ని ప్రవేశపెట్టారు.   

జిల్లా ట్రెజరీ అధికారి పేరుతో...  

జిల్లా ట్రెజరీ అధికారి పేరుతో ఆర్‌బీఐ ఒక ప్రభుత్వ ఖాతాను తెరుస్తారు. దీని ద్వారా అన్ని రకాల చెల్లింపులు చేసే విధంగా అధికారాలు ఇచ్చారు. ఇందులో భాగంగానే ప్రభుత్వ ఉద్యోగలకు వేతనాలు చెల్లించనున్నారు. ప్రభుత్వ శాఖల ద్వారా జీతాలు తీసుకునే రోజువారీ కార్మికులు, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ ఉద్యోగులు, అంగన్‌వాడీ ఉద్యోగులు, హోంగార్డులు, కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న వారు, గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, మండల పరిషత్‌ నిధులు, ఉపకార వేతనాలు, వివిధ ప్రభుత్వ పథకాలకు నేరుగా బిల్లులు చెల్లించనున్నారు.  

నేడు ఈ– కుబేర్‌ ద్వారానే జీతాలు... 

నేడు (ఆగస్టు) 1వ తేదీన అందాల్సిన జీతాలు ఇదే పద్ధతిన ఉద్యోగుల ఖాతాల్లో జమకానున్నాయి. ఈ విధానాన్ని పూర్తిగా పరిశీలించేందుకు ఇటీవల ఉద్యోగుల ఖాతాల్లో 1 రూపాయి జమచేసి చూశారు. ఆ ఒక్క రూపాయి ఉద్యోగుల ఖాతాలో జమకాలేదంటే ఆ ఉద్యోగి వివరాలు ఈ– కుబేర్‌ వెబ్‌సైట్‌లో పొందపర్చలేదని అర్థం. వివరాలు ఇవ్వని ఆయా శాఖల ఉద్యోగుల వివరాలను సబ్‌ ట్రెజరీ అధికారులు పూర్తి స్థాయిలో తెప్పించుకున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement