చింతపల్లి : గ్రామీణ ప్రాంతాల్లోని గొల్ల, కురుమలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రాయితీ గొర్రెల పథకం కొందరికి కాసులపంట పండిస్తుంది. దళారులు లబ్ధిదారుల నుంచి యూనిట్‌కు రూ. 2వేలు వసూలు చేస్తున్నారు. అధికారులు నాణ్యమైనవి పంపిణీ చేయకపోవడంతో గొర్రెలు మృత్యువాతపడుతున్నాయని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. మరికొందరు అక్రమంగా విక్రయిస్తున్నా అడ్డుకట్ట వేసే వారు కరువవుతున్నారు. చింతపల్లి మండలంలోని 20 గ్రామపంచాయతీల్లో మొదటి దశలో 1105 మంది లబ్ధిదారులు, 2వ విడతలో 1104 మంది లబ్ధిదారులకు రాయితీ గొర్రెలను అందించేందుకు అధికారులు ముందుకొచ్చారు. మొదటి విడతగా 13 గ్రామాలను ఎంపిక చేసి 395 మంది లబ్ధిదారులకు లా టరీ పద్ధతిలో ఎంపిక చేసి 8,295 గొర్రెలను పంపిణీ చేశారు. ప్రతి లబ్ధిదారుడికి కచ్చితంగా 20 గొర్రెలు, ఒక పొట్టేలు అందించాల్సి ఉంది. అధికారులు మాత్రం తక్కువ ధరకు గొర్రెలను కొనుగోలు చేసి 15 గొర్రెలు, 5 పాలు తాగే వయసున్న గొర్రెలను అంటగట్టారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో గొర్రెలను ఇంటికి తెచ్చిన తర్వాత వయసు మీరిన చిన్న గొర్రెలు మృత్యువాతపడుతున్నాయని చెబుతున్నారు. సకాలంలో వైద్యం అందక మరణిస్తున్నాయి. ఇప్పటికే 900 గొర్రెలకు పైగా మృతి చెందినట్లు సమాచారం.
200 యూనిట్లు మాయం..
మండలంలో మొదటి విడతలో 395 మంది లబ్ధిదారులకు గొర్రెలను పంపిణీ చేశారు. ఇప్పటికే 200 యూనిట్లు విక్రయాలు జరిగినట్లు సమాచారం. ఎప్పటికప్పుడు పశువైద్య అధికారులు గ్రామాలకు వెళ్లి తనిఖీ చేస్తే జీవాలు కనిపించకపోవడంతో కంగుతింటున్నారు. బయటి మార్కెట్లో గొర్రెలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్న అధికారులు పేపర్ ప్రకటనలకే పరిమితం అవుతున్నారు. లబ్ధిదారులు రూ.31,250 చెల్లిస్తే 21 గొర్రెలను అధికారులు అందిస్తున్నారు. బయటి మార్కెట్లో రూ. 80వేలకుపైగా వస్తుండడంతో మండలంలో అక్రమ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అధికారులు ఇదే అదునుగా చేసుకుని దళారులకు ఒత్తాసు పలుకుతూ గొర్రెల విక్రయానికి సహకరిస్తున్నట్లు సమాచారం. ఒక్కో రైతు వద్ద రూ. 2వేలు వసూలు చేస్తున్నట్లు సమాచారం రావడంతో నెల రోజుల క్రితం విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా అధికారులకు ఖంగుతినే పరిస్థితి కనిపించింది. విక్రయదారులు అధికారులు వస్తున్నారనే సమాచారంతో ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిన సంఘటనలతో పాటు రెండు, మూడు గొర్రెల గుంపును అధికారులు వచ్చే ముందు వారి ఇంటి ముందు ఉంచుకుంటుండడంతో అధికారులు ఏం చేయలేని పరిస్థితి నెలకొంది.
పథకం పక్కదారి
Published Thu, Mar 29 2018 8:40 AM | Last Updated on Thu, Mar 29 2018 8:40 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment